Ustaad Bhagat Singh పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పదవి పట్ల, పవన్ కళ్యాణ్ చేస్తున్న పనుల పట్ల అభిమానులు ఎంతో సంతోషంతో ఉన్నారు. అయితే నిన్న మొన్నటి వరకు అభిమానులను వేధించిన ప్రశ్న పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనే. ఇటీవలే పిఠాపురం పర్యటన లో భాగంగా వారాహి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండగా, అభిమానులు గట్టిగా ఓజీ అని అరుస్తుండడం చూసి, ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తాను మూడు నెలల తర్వాత అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అభిమానులు పండగ చేసుకున్నారు. అయితే ఓజీ, హరి హర వీరమల్లు సినిమాలు రెండు పూర్తి చెయ్యడానికి కేవలం 40 రోజులు మాత్రమే కావాలి.
కానీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని పూర్తి చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ నుండి 60 రోజులకు పైగా డేట్స్ కావాలి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాగా బిజీ గా ఉండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి డేట్స్ కేటాయించలేడని, కాబట్టి ఈ చిత్రం ఆగిపోయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతూ వచ్చింది. సినిమా నిజంగా ఆగిపోయిందా అని ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు అడగగా, దానికి హరీష్ శంకర్ సమాధానం చెప్తూ ‘సినిమా అసలు మొదలు కాదు అని ఎన్నో రూమర్స్ పుట్టించారు. ఇప్పుడు కొత్త రూమర్లు చదివే ఓపిక అసలు లేదు’ అంటూ ట్వీట్ చేసారు.
దీంతో సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా ప్రచారం అవుతున్న ఆ వార్త ఫేక్ అని తేలింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీ, హరిహరవీరమల్లు చిత్రాలు పూర్తి చేసిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి డేట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ 40 శాతం పూర్తి అయ్యింది. రెండు టీజర్లు విడుదల అవ్వగా, రెండిటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుండగా, మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి.