అల్లరి నరేశ్.. సూపర్ హిట్ డైరెక్టర్ కొడుకుగా టాలీవుడ్లో అడుగుపెట్టినా.. తొలి మూవీతోనే తన వైవిద్యాన్ని చూపించి ఆ సినిమా పేరే తన ఇంటి పేరుగా మార్చుకున్న హీరో. అల్లరి తర్వాత తండ్రి బాటలోనే కామెడీ చిత్రాల్లో సాగిపోయి బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన నరేశ్.. నేను, గమ్యం, మహర్షి, నాంది వంటి సినిమాలతో తనలోని నటుడిని బయటకు తీశారు. కామెడీతో నరేశ్ ఎంత నవ్వించగలడో.. ఎమోషనల్ పాత్రల్లో అంతకు మించి ఏడిపించగలడని ప్రూవ్ చేశాడు. ఇప్పుడు అదే బాటలో తనలోని నటుడిని మరింత మెరుగుపెట్టేస్తూ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నికల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన Itlu Maredumilli Prajaneekam సినిమా అల్లరి నరేశ్ ఖాతాలో మరో వర్సటైల్ హిట్‌ని అందిస్తుందా లేదో చూద్దాం..?
స్టోరీ ఏంటంటే.. : శ్రీపాద శ్రీనివాస్ (అల్లరి నరేశ్) తెలుగు టీచర్. నలుగురికి సాయం చేసే గుణం ఉన్న మనిషి. ఎన్నికల డ్యూటీ కోసం రంప చోడవరం సమీపంలోని మారేడుమిల్లి గ్రామానికి వెళతాడు. పురిటి నొప్పులు పడుతున్న మహిళలను ఆస్పత్రికి తీసుకు వెళ్లాలంటే నది దాటాలి. చదువు సంధ్యలకు అయినా అంతే! గిరిజన గ్రామాల ప్రజలు తమ కష్టాలు ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. అందుకని ఓటు వేయడానికి నిరాకరిస్తారు. శ్రీపాద శ్రీనివాస్ చేసిన ఓ పని వల్ల అందరూ ఓటు వేస్తారు. అయితే… బ్యాలెట్ బాక్సులతో వెళ్తున్న అధికారులను గిరిజన గ్రామంలోని కండా (శ్రీతేజ) కిడ్నాప్ చేస్తాడు. ఎందుకు? కిడ్నాప్ అయిన అధికారులను విడిపించడానికి ప్రభుత్వం ఏం చేసింది? చివరకు ఏం అయింది? లక్ష్మీ (ఆనంది) ఎవరు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
మూవీ ఎలా ఉందంటే..? : ఎన్నికల బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలు టాలీవుడ్‌కు కొత్తేం కాదు. ఎలక్షన్స్ టైంలో మాత్రమే రాజకీయ నాయకులకు ప్రజలు గుర్తొస్తారని.. ఆ తర్వాత పట్టించుకోరనే టైపు డైలాగులు ఇప్పటి వరకు చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఇలాంటివి సినిమాలో ఒక 10 నిమిషాల సీన్ మాత్రమే ఉండేది. కానీ ఈ మూవీ స్టోరీ మొత్తం ఎలక్షన్స్ చుట్టే తిరుగుతుంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొన్ని గ్రామాల ప్రజలు తమ సమస్యలు తీర్చలేదని ఎలక్షన్ బహిష్కరించారని మనం వార్తల్లో చదువుంటాం. అదే కాన్సెప్ట్‌ను తీసుకుని ఆ ఒక్క పాయింట్‌పై తీసిందే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. సినిమాలో కొత్తదనం లేదు. మూవీ స్టార్‌లోనే ఎండింగ్ ఏంటనేది ప్రేక్షకుడు ఊహించగలడు. ఇలాంటి సినిమాలకు కథనం బలం. ప్రజల సమస్యలను ప్రేక్షకులకు చెప్పేటప్పుడు ఎమోషన్ మిస్ కాకూడదు. ఈ సినిమాలు ఈ రెండూ మిస్ అయ్యాయి. హీరో పాత్ర గిరిజనుల సమస్యలు చూసి చలించిపోయే సన్నివేశాల్లో మరింత భావోద్వేగం, బలం ఉండుంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. రొటీన్ క్లైమాక్స్‌తో ప్రేక్షకులను డైరెక్టర్ కాస్త నిరాశపరిచాడని చెప్పొచ్చు. ఈ మూవీ మొత్తానికి ప్రాణం అబ్బూరి రవి డైలాగ్స్.. అవి పలికిన అల్లరి నరేశ్. ‘తప్పు చేసి శిక్ష పడినా పర్వాలేదు.. సాయం చేసి బాధ పడకూడదు’, ‘సాయం చేస్తే మనిషి.. దాడి చేస్తే మృగం’, ‘మనందరం గొప్పవాళ్ళం అయిపోవాలని అనుకుంటున్నాం… కానీ ఎవరూ మనిషి కావడం లేదు’ వంటి అర్థవంతమైన సంభాషణలు రాశారు. ఆయన మాటలు కొన్ని సన్నివేశాలను బలంగా మార్చాయి. సినిమాటోగ్రఫీ ఓకే.
యాక్టింగ్ ఎలా చేశారంటే..? : ‘అల్లరి’ నరేశ్‌కు ఇది ఛాలెంజింగ్ పాత్ర కాకపోయినా.. తను పాత్ర పరిధి మేరకు నటించాడు. ప్రేక్షకులు నరేశ్‌ను కామెడీ యాంగిల్లో ఎంత యాక్సెప్ట్ చేస్తారో సీరియస్ పాత్రల్లోనూ అంతే యాక్సెప్ట్ చేస్తారు. ఇది నరేశ్‌కు కలిసొచ్చే అంశం. శ్రీపాద శ్రీనివాస్ పాత్రకు ఎంత కావాలో, అంత వరకు చేశాడు. నటుడిగా మరోసారి సీరియస్ రోల్స్ కూడా చేయగలనని ప్రూవ్ చేశాడు. సీరియస్ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ కాసేపు నవ్వించారు. ఆనంది, శ్రీతేజ్, కుమనన్ సేతురామన్, ‘జెమినీ’ సురేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కామాక్షి భాస్కర్ల భావోద్వేగ భరిత పాత్రలో మెరిశారు.
చిత్రం : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం;
దర్శకుడు: ఏఆర్ మోహన్ ;
నటీనటులు : ‘అల్లరి’ నరేష్, ఆనంది, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, శ్రీతేజ్, కామాక్షి భాస్కర్ల, కుమనన్ సేతురామన్ తదితరులు;
మాటలు : అబ్బూరి రవి ; ఛాయాగ్రహణం : రామ్ రెడ్డి ; సంగీతం : శ్రీచరణ్ పాకాల ; నిర్మాణ సంస్థలు: హాస్య మూవీస్, జీ స్టూడియోస్ ;
నిర్మాత : రాజేష్ దండా ;
రచన, దర్శకత్వం : ఏఆర్ మోహన్ ;
కన్‌క్లూజన్ : ‘ఇట్లు మారేడిమిల్లి ప్రజానీకం’.. ప్రేక్షకులు ఊహించినంత మెప్పించకపోవచ్చు
రేటింగ్ : 2/5
Book Your Tickets : Itlu Maredumilli Prajaneekam