Tegimpu Review : అభిమానంలో తమిళుల తర్వాతే ఎవరైనా అంటూ ఉంటారు పెద్దలు. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఏమోగానీ.. వారి అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత పోటీ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు అజిత్, విజయ్‌ల మధ్యే కాదు వారి ఫ్యాన్స్ మధ్య బహిరంగ ఫైటే జరుగుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో వీళ్ల ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు.
అజిత్, విజయ్‌లు బాక్సాఫీస్ వద్ద చాలాసార్లు పోటీ పడ్డారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో కూడా వీళ్లు పోటీ పడ్డారు. అజిత్ కుమార్ హీరోగా నటించిన ‘తునివు’, విజయ్ కథానాయకుడిగా ‘వారిసు’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలూ తెలుగులోకి కూడా అనువాదమయ్యాయి. ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’గా నేడు విడుదలైంది. ‘వారిసు’ మాత్రం ‘వారసుడు’గా ఈనెల 14న వస్తోంది.
అజిత్ హెచ్ వినోద్ కాంబోలో ఇది వరకు నేర్కోండ పార్వై, వలిమై సినిమాలు వచ్చాయి. ఈ రెండూ కూడా పర్వాలేదనిపించాయి. వలిమై సినిమాలో యాక్షన్స్ అదిరిపోయాయి. ఇప్పుడు తెగింపు అంటూ మరోసారి అజిత్, హెచ్ వినోద్‌లు వచ్చారు. మరి ఈ తెగింపు ట్రైలర్ చూస్తే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అదిరినట్టు కనిపిస్తున్నాయి. మరి అజిత్ తెగింపు తెలుగు ప్రేక్షకులకు నచ్చిందా లేదా ఓసారి చూసేద్దామా..?
స్టోరీ ఏంటంటే.. తెగింపు సినిమాలో అజిత్‌కు ఒక పేరంటూ ఉండదు. డార్క్ డెవిల్, చీఫ్, మైఖేల్ జాక్సన్ ఇలా రకరకాల పేర్లతో కథ ముందుకు సాగుతూ ఉంటుంది. అజిత్, కణ్మణి (మంజు వారియర్) ఇంకా ముగ్గురు కలిసి ఓ గ్యాంగ్‌లా ఏర్పడతారు. వారి వద్ద అధునాతమైన టెక్నాలజీతో కూడుకున్న వెపన్స్ ఉంటాయి. వారంతా కలిసి ఓ బ్యాంక్‌ను దోపీడీ చేయాల్సి వస్తుంది. క్రిష్ (జాన్ కొక్కెన్) అధినేతగా ఉన్న యువర్ బ్యాంక్‌ను ఎందుకు దోపీడి చేయాల్సి వస్తుంది.. ఆ సుపారీ ఇచ్చింది ఎవరు? అసలు ఈ బ్యాంక్‌ను టార్గెట్ చేయడం వెనుకున్న కథ ఏంటి? అజిత్ పాత్ర ఇచ్చే ట్విస్టులు ఏంటి? చివరకు ఎండ్ కార్డ్ ఎలా పడింది? బ్యాంక్ ఫ్రాడ్‌ల మీద తెగింపు ఇచ్చిన సందేశం ఏంటి? అనేది కథ.
మూవీ ఎలా ఉందంటే.. సాధారణంగా బ్యాంకు దోపిడీ అంటే ఒకే ప్రదేశంలోనే చిత్రీకరించాల్సి ఉంటుంది ప్రేక్షకులు కాస్త బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కానీ దర్శకుడు వినోద్ ఈ బ్యాంకు రాబరీ నేపథ్యం ఉన్న సినిమాని ఆసక్తికరంగా మలచడంలో సఫలమయ్యాడు. బ్యాంకు దోపిడీదారులుగా లోపలికి ఎంట్రీ ఇచ్చిన వారిని ప్రజలందరూ హీరోలుగా చూసేలా చేయడంలో కూడా దర్శకుడు తనదైన మ్యాజిక్ చూపించాడు. బ్యాంకు మోసాలను కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించినట్లుగా సినిమా సాగింది. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినప్పుడు ప్రాణాలు తీసుకోకండి ఆ తెగింపు ఏదో ఆ ఫ్రాడ్స్ కి కారణమైన వారిని నిలదీయడానికి వాడండి అని చెప్పేదే తెగింపు. అజిత్ అంటేనే ఒక స్టైలిష్ హీరో అనే పేరు ఉంది దాన్ని మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేసినట్లయింది.
యాక్టింగ్ ఎలా ఉందంటే.. అజిత్ తనకు ఎప్పటిలానే అలవాటైన యాక్షన్ సీక్వెన్స్‌లో ఎంతో స్టైలిష్‌గా చేసేశాడు. అజిత్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక మంజు వారియర్‌కు మరో అద్భతమైన పాత్ర దొరికింది. ఈసారీ మంజు తన నటనతో అదరగొట్టింది. యాక్షన్ సీక్వెన్స్‌లో మంజు వారియర్ చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తుంది. జాన్ కొక్కెన్‌కు సైతం మంచి కారెక్టర్ పడింది. ఇతర నటులు వారి పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ మూవీలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది.
సినిమా : తెగింపు
డైరెక్టర్ : హెచ్ వినోద్
నటీనటులు : అజిత్, మంజు వారియర్, సముద్రఖని, యోగి బాబు, జాన్ కొక్కెన్, తదితరులు
నిర్మాత : బోనీ కపూర్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్, జిబ్రాన్
Conclusion : యాక్షన్‌లో అజిత్ ‘తెగింపు’కు తెలుగు ప్రేక్షకులు ఫిదా
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
రేటింగ్ : 3/5