Vijay Thalapathi Vs Ajith : విజయ్‌ Vs అజిత్‌.. బాక్సాఫీస్ వద్ద ఈ స్టార్లు ఎన్నిసార్లు పోటీ పడ్డారో తెలుసా..?



Vijay Thalapathi Vs Ajith : స్టార్ హీరో సినిమా విడుదలవుతోందంటే ప్రేక్షకుల హడావుడి మామూలుగా ఉండదు. ఇక థియేటర్ల వద్ద సందడి గురించి చెప్పనక్కర్లేదు. అదే ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి వస్తే.. అది కూడా సంక్రాంతి బరిలో అయితే.. ఆ కిక్కే వేరప్పా. ఈ సంక్రాంతికి టాలీవుడ్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలుగా ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు తమిళ నటులు అజిత్‌, విజయ్‌లు తమ చిత్రాలతో ఈ పొంగల్‌కు పోటీ పడబోతున్నారు.

Vijay Thalapathi Vs Ajith
Vijay Thalapathi Vs Ajith

జనవరి 11న తమిళ స్టార్ హీరోలు అజిత్, విజయ్ లు బరిలో దిగబోతున్నారు. ఇప్పటికే 9 సార్లు తలపడిన వీరు పదోసారి వార్‌కు సిద్ధమయ్యారు. ఆ చిత్రాలు తెలుగులోనూ వస్తుండడంతో తమిళ చిత్ర పరిశ్రమతోపాటు ఇక్కడా ఆసక్తి నెలకొంది. దాంతో, వీరు గతంలో ఎప్పుడెప్పుడు తమ ప్రాజెక్టులతో పోటీ పడ్డారోనని సినీ అభిమానులు నెట్టింట వెతుకుతున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్లు ఎన్నిసార్లు పోటీ పడ్డారో మనమూ తెలుసుకుందామా..?

Vaarisu and Thunivu
Vaarisu and Thunivu

తొలిసారి ఆట ఎప్పుడు మొదలైందంటే.. విజయ్‌, అజిత్‌ 1996 సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద తొలిసారి పోటీ పడ్డారు. అజిత్‌ నటించిన ‘వాన్‌మతి’ ఆ ఏడాది జనవరి 12న, విజయ్‌ ‘కోయంబత్తూర్‌ మప్పిళ్లై’ సినిమా జనవరి 15న విడుదలయ్యాయి. రొమాంటిక్‌ కామెడీ- డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ రెండు చిత్రాలూ కమర్షియల్‌గా హిట్‌ అయ్యాయి. 1996లో మరోసారి ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీసు బరిలో నిలిచారు. విజయ్‌ నటించిన ‘పూవే ఉనక్కగ’.. మరో హీరో ప్రశాంత్‌తో కలిసి అజిత్‌ నటించిన ‘కల్లూరి వాసల్‌’ ఆ సంవత్సరం ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

1997 సంక్రాంతి సీజన్‌కూ విజయ్‌, అజిత్‌లు రొమాంటిక్‌ నేపథ్య చిత్రాలతోనే పోటీపడ్డారు. ‘కాలమెల్లమ్‌ కాతతిరుప్పెన్‌’ (విజయ్‌), ‘నేసమ్‌’ (అజిత్‌) చిత్రాలు ఆ ఏడాది జనవరి 15న విడుదలయ్యాయి. విజయ్‌ సినిమాకు విజయం దక్కింది. 

విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఖుషి’, అజిత్‌ హీరోగా రూపొందిన ‘ఉన్నై కొడు ఎన్నై తరువెన్‌‘ చిత్రాలు 2000 మే 19న బాక్సాఫీసు బరిలో దిగాయి. నేపథ్యాలు వేరైనా రెండింటికీ చక్కని ఆదరణ దక్కింది. ‘ఖుషి’ సినిమా తెలుగులో అదే పేరుతో పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కి, ఘన విజయం అందుకుంది.

విజయ్‌ హీరోగా తెరకెక్కిన ‘ఫ్రెండ్స్‌’, అజిత్‌ కథానాయకుడిగా నటించిన ‘ధీనా’ 2001 జనవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిల్లో ‘ధీనా’ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అప్పటి వరకూ ఉన్న అజిత్‌ లవర్‌ బాయ్‌ ఇమేజ్‌ను ఆ సినిమా పూర్తిగా మార్చేసింది. ఆ చిత్రంతోనే అజిత్‌ మాస్‌ హీరోగా మారారు. అప్పటి నుంచే అభిమానులు ఆయన్ను తలా అని పిలుచుకోవడం ప్రారంభించారు. అయితే, తనను అలా పిలవద్దని, అజిత్‌ అని పిలిస్తే చాలని ఆయన అభిమానులకు కొన్ని నెలల క్రితం విజ్ఞప్తి చేశారు.

యాక్షన్‌ నేపథ్యంలో విజయ్‌ నటించిన ‘భగవతి’, అజిత్‌ నటించిన ‘విలన్‌’ చిత్రాలు 2002 నవంబరు 4న బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. ‘విలన్‌’లో అజిత్‌ ద్విపాత్రాభినయం చేశారు. రెండింటీకీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించినా ‘దీపావళి’ విన్నర్‌గా అజిత్‌ నిలిచారు.

అజిత్‌ కథానాయకుడిగా తెరకెక్కిన యాక్షన్‌ చిత్రాల్లో ‘పరమశివన్‌’ ఒకటి. ఈ సినిమా 2006 సంక్రాంతికి  జనవరి 14న విడుదలైంది. విజయ్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆది’. తెలుగు సినిమా ‘అతనొక్కడే’కు రీమేక్‌గా రూపొందింది. ఈ చిత్రం అదే ఏడాది జనవరి 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది.

పోకిరి రీమేక్‌తో విజయ్‌.. ఆళ్వార్‌గా అజిత్‌

మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ చిత్రం టాలీవుడ్‌లో నయా రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికి రీమేక్‌గా విజయ్‌ నటించిన చిత్రం ‘పోక్కిరి’. 2007 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై, సూపర్‌హిట్‌ అయింది. అదే రోజు విడుదలైన అజిత్‌ ‘ఆళ్వార్‌’ చిత్రం తమిళ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్‌తో కలిసి విజయ్‌ నటించిన చిత్రం ‘జిల్లా’, అజిత్‌ నటించిన ‘వీరమ్‌’ .. ఈ రెండూ 2014 జనవరి 10న విడుదలయ్యాయి. రెండింటికీ ప్రేక్షకాదరణ దక్కింది. ‘వీరమ్‌’.. ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో రిలీజ్‌ అయింది. 

దాదాపు 8 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి చిత్రాలు ఒకే రోజు విడుదలకాబోతున్నాయి. విజయ్‌ ‘వారిసు’, అజిత్‌ ‘తునివు’ సినిమాలు జనవరి 11న రాబోతున్నాయి. ఇవి తెలుగులోనూ (వారసుడు, తెగింపు అనే టైటిళ్లతో) వస్తుండడంతో ఇక్కడ ప్రేక్షకులూ ఆసక్తి చూపిస్తున్నారు. ‘వారిసు’ను టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించడంతో దానిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 

‘నేర్కొండ పార్వై’, ‘వలిమై’ వంటి వరుస విజయాల తర్వాత అజిత్‌- దర్శకుడు హెచ్‌. వినోద్‌ కాంబినేషన్‌లో రూపొందిన సినిమాకావడం, అజిత్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తుండడంతో ‘తునివు’ అందరినీ ఆకర్షిస్తోంది. ఇందులో మంజు వారియర్‌ కథానాయిక.