Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి యూత్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు లో ఆమె హీరోయిన్ గా నటించిన సినిమా ఇప్పటి వరకు విడుదల కాలేదు కానీ, హిందీ లో మాత్రం ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించింది. అధిక శాతం రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా కాకుండా, కేవలం నటనకి ప్రాధాన్యం ఇచ్చిన పాత్రలను మాత్రమే పోషిస్తూ ముందుకు పోయింది. కానీ ఈమెకు హిందీ లో ఎందుకో లక్ ఇప్పటి వరకు కలిసి రాలేదు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు ఈమె నటించినవి సక్సెస్ కాకపోవడం గమనార్హం.
ఇప్పుడు ఈమె తెలుగు లో ఎన్టీఆర్ తో ‘దేవర’ చిత్రం చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27 వ తారీఖున విడుదల కానుంది . ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ – బుచ్చి బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటించబోతుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని స్టార్ హీరోల సినిమాలకు ఆమె సంతకం చేసింది. వీటితో ఆమె అదృష్టం మారుతుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే రీసెంట్ గా ఈమె ఆసుపత్రి పాలయ్యింది అనే వార్త సోషల్ మీడియా లో ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూసాము.
ఈ సంఘటన గురించి జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘హాస్పిటల్ లో చేరడం నాకు ఇదే తొలిసారి. ఒక ఈవెంట్ కోసం చెన్నై వెళ్తుండగా మధ్యలో నాకు బాగా ఆకలి వేసింది. దీంతో విమానాశ్రయం లో నేను ఫుడ్ తిన్నాను. తొలుత బాగానే ఉంది కానీ , ప్రయాణించేటప్పుడు విపరీతమైన కడుపు నొప్పి రావడం మొదలైంది. ఆ తర్వాత బాగా నీరసం వచ్చేలోపు భయం తో వణికిపోయాను. దీంతో హైదరాబాద్ కి వెళ్లేందుకు ఫ్లైట్ ఎక్కాను. ఆ సమయం లో నాకు పక్షవాతం వచ్చిన అనుభూతి కలిగింది. వెంటనే హాస్పిటల్ లో చేరగా, లివర్ కి సంబంధించిన సమస్య ఏర్పడిందని, రెండు మూడు రోజులు కచ్చితంగా హాస్పిటల్ లో ఉండాల్సిందే అని డాక్టర్లు చెప్పడం తో భయపడ్డాను. అయితే సరైన చికిత్స తీసుకోవడం వల్ల ఇప్పుడు అంతా సర్దుకుంది’ అని చెప్పుకొచ్చింది.