సాధారణంగా ఓ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే కొంతమంది డైరెక్టర్లు దాని సీక్వెల్ ప్లాన్ చేస్తారు. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ అంటే ప్రేక్షకులు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తుంటారు. ఇక ఆ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేయాలని ప్రతి నటుడు, నటి అనుకుంటారు. కానీ ఓ సినిమా సీక్వెల్ విషయంలో మాత్రం అంతా రివర్స్ జరుగుతోంది. బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుని సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఓ సినిమాలో నటించడానికి వరుసగా హీరోయిన్స్ నో చెప్పేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది.
డీజే టిల్లు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. టిల్లు సినిమాలో పాటలు, డైలాగ్స్ ప్రతి ఒక్కటి యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. డీజే టిల్లు పాట లేని ఫంక్షన్ లేదంటూ నమ్మశక్యం కాదు. అలాగే సాధారణంగా ఫ్రెండ్స్, కొలీగ్స్ మాట్లాడుకునే మాటల్లో కచ్చితంగా డీజే టిల్లు డైలాగ్స్ ఉంటాయి. నువ్వు నిజంగానే నన్ను అడుగుతున్నవా రాధికా.., అట్లుంటది మనతోని లాంటి డైలాగ్స్ అయితే యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాయి.
సూపర్ హిట్ టాక్, బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధించిన డీజే టిల్లు కోసం సీక్వెల్ తీయాలని ప్లాన్ చేశారు. ఈ మూవీ సీక్వెల్ తీయడానికి ఫస్ట్ పార్ట్ డైరెక్టర్ విమల్ కృష్ణ తన వల్ల కాదని సీక్వెల్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ షూటింగ్ షురూ కాకముందే హీరోయిన్ రాధిక అదేనండి నేహా శెట్టి ఔట్ అయిపోయింది. సీక్వెల్ కోసం ఫైనల్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ షూటింగ్ ప్రారంభం అయ్యాక సడెన్‌గా మూవీ నుంచి తప్పుకుంది. ఇలా వరుసగా ఈ సినిమాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇంతకీ ‘టీల్లు 2’ తెర వెనుక ఏం జరుగుతోంది అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అనుపమ పరమేశ్వరన్ తప్పుకున్న తర్వాత ఆ స్థానంలో ‘ప్రేమమ్’ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్‌ని ఎంపిక చేసుకున్నారు. ముందు నేహాశెట్టి స్థానంలో రాశీఖన్నాని ఎంపిక చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ ఆమె ఆసక్తిని చూపించలేదు. ఆ తరువాత టీమ్ అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేసింది. ఇప్పడు తను కూడా తప్పుకోవడంతో ఆ స్థానంలో మడోన్నా సెబాస్టియన్ ని ఎంపిక చేసుకున్నారు. ఇలా అండర్ ప్రొడక్షన్‌లో ఉండగానే బ్యాక్ టు బ్యాక్ హీరోయిన్ లు ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్లిపోతుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
‘డీజే టిల్లు’లో హీరోయిన్‌కు అంత ప్రాధాన్యత లేదు. నిజం చెప్పాలంటే ‘Rx100’ తరహాలో హీరోయిన్ క్యారెక్టర్ విలన్ అని చెప్పొచ్చు. ఆ కారణంగానే ప్రాధాన్యతలేని పాత్రలో నటించడం ఇష్టం లేక సిద్దూతో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేకనే హీరోయిన్ లు వెళ్లిపోతున్నారని అలాంటి పాత్రలో మడోన్నా సెబాస్టియన్ కూడా ఈ మూవీతో పెద్దగా ఫేమ్‌ను దక్కించుకోవడం కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి.