Balakrishna : ఒక హోదా వచ్చి పబ్లిక్ ఫిగర్ అయ్యాక వాళ్లేం కదలికలపై నిరంతరం నిఘా ఉంటుంది. వాళ్లు చేసే ప్రతి పనిపై జనాల జడ్జిమెంట్ ఉంటుంది. అందుకే పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలంతా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఏం మాట్లాడాలో.. ఎలాంటి దుస్తులు ధరించాలో.. ఎలాంటి నడవడిక ప్రయోగించాలో.. ఇలా ప్రతి విషయంలో జాగ్రత్త పడుతుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు ఏదో ఒక విషయంలో జనం నోట్లో నెగిటివ్‌గా నానుతుంటారు. వారి జడ్జిమెంట్‌కు బలైపోతుంటారు.
ఇది ఒక వర్గం సెలబ్రిటీల పంథా.మరి కొందరుంటారు. సెలబ్రిటీ హోదాలో ఉన్నాం.. మన మాటలు.. చేతల ప్రభావం జనంపై పడుతుందనే విషయాన్ని విస్మరిస్తుంటారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటారు. ఇలాంటి వాళ్ల మాటల్ని జనం పట్టించుకోరు. అదే వాళ్లకు ప్లస్ అవుతుంది.
ఓ వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోరు. పెదవి దాటిన మాట పుధ్వీ దాటుతుందన్న నానుడిని పట్టించుకోరు. అసలే డిజిటల్ మీడియా. ఏం చేసినా.. కెమెరా కనిపెట్టేస్తుంది. నెట్టింట దాచేస్తుంది. సమయం వచ్చినప్పుడు అందరి ముందు పెట్టి కడిగేస్తుంది. బాలయ్యలో చాలా విషయం.. పరిజ్ఞానం ఉంటుంది. కానీ దానికి తలా తోక ఉండవు. సరైన స్క్రీన్‌ప్లే లేక అప్పుడప్పుడు అది హద్దు దాటుతూ ఉంటుంది. బాలయ్య నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. ఒక టాపిక్ మాట్లాడుతున్నప్పుడు.. సరైన పదం గుర్తురాక వెంటనే ఇంకో టాపిక్‌లోకి జంప్ చేసేస్తారు. ఆ మాటలు అలా సాగితే ఫర్వాలేదు.. కానీ తప్పుగా దొర్లితేనే కష్టం.
ఆదివారం రోజున హైదరాబాద్‌లో వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ పెట్టారు. ఈ సక్సెస్ మీట్‌లో బాలకృష్ణ ప్రసంగా జోరుగా సాగింది. అంతా జాలీగా సాగుతుందనుకున్న సమయంలో బాలయ్య మళ్లీ నోరు జారారు. సక్సెస్ మీట్‌లో ఏదో మాట్లాడుతూ, పక్కన ఎవరి గురించో చెబుతూ, ‘ఈయన ఉన్నాడంటే సెట్‌లో ఏదో ఒకటి… ఆ రంగారావు..ఈ రంగారావు .. అక్కినేని.. తొక్కినేని..’ అంటూ మాట బాలయ్య నోరుజారారు. అక్కినేని..తొక్కినేని అన్న పద ప్రయోగం వాడటం ఎంత వరకు గౌరవప్రదం అన్నది బాలయ్యకే తెలియాలి. మన కర్మ ఏంటంటే.. ఈ మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఎవరూ పట్టించుకోరు. చివరకు ఆ మాటలు పడిన కుటుంబం కూడా స్పందించదు. అందుకే బాలయ్య తన నోటికి వచ్చింది మాట్లాడేస్తుంటారు.
ఇదే సభలో బాలయ్య మరో మాట కూడా అన్నారు. నీతి..నిజాయతీతో గర్జించాలి అంటే తనలా సింహంలా పుట్టాలని… దాని మీద కూడా టాలీవుడ్ లో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘డైరెక్టర్ గోపీచంద్ మలినేని నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాం. అప్పుడే సీమ రక్తం కుతకుతలాడుతోందని అన్నా. నా అభిమాని కాబట్టి గోపీచంద్ మలినేని వెంటనే ‘చెన్నకేశవరెడ్డి’ అన్నాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో అద్భుతమైన కథ చేశాడు. ఇది కథ కూడా కాదు, ఇదొక ప్రయాణం. తెలుగు ప్రేక్షకులతోపాటు, ఇతర భాషలకి చెందిన అభిమానులు కూడా ఈ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు.’ అని అన్నారు.