Anjali : ఏమో నాకన్నలా తెలిసిపోతాయి.. ఈ డైలాగ్ గుర్తుంది కదా మీకు. అదేనండి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సీత చెప్పే మాట. సీత పాత్రలో నటి అంజలి నటన ఎంతగా ఆకట్టుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాత్రలో అంజలి టాలీవుడ్ సీతగా మారిపోయింది. ఎన్ని పాత్రలు చేసినా.. అంజలికి ఇది తన లైఫ్ లో గుర్తుండిపోయే పాత్ర.. తనకు చాలా గుర్తింపు తీసుకొచ్చిన పాత్ర. ఇవే కాకుండా జర్నీ, బలుపు, గీతాంజలి వంటి సినిమాలతో అంజలి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
శంకరాభరణం వంటి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అంజలి తనలోని వర్సటాలిటీని బయట పెట్టింది. అంతే కాకుండా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంటూ సరైనోడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి ఆకట్టుకుంది. ఈ సాంగ్ ఆ సినిమాకే హైలైట్. రారా రెడ్డి.. ఐయామ్ రెడీ అంటూ మాచర్ల నియోజకవర్గంలోనూ ఓ స్పెషల్ సాంగ్ తో అదరగొట్టింది అంజలి.
అయితే ఇటీవల అంజలి పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఓవైపు అంజలి తన జర్నీ కో స్టార్ జైతో రిలేషన్ షిప్ లో ఉందంటూ వార్తలొస్తున్నాయి. మరోవైపు అమెరికాకు చెందిన ఓ వ్యక్తితో ఏకంగా పెళ్లి కూడా జరిగిందని పుకార్లు వచ్చాయి. వీటిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా అంజలి ఈ పుకార్లపై స్పందించింది.
గతంలో తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నానని.. అయితే అదొక విషపూరితమైన అనుబంధమని నటి అంజలి చెప్పింది. ‘ఫాల్’ ప్రమోషన్స్‌లో భాగంగా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘కొంతకాలం క్రితం నేనొక విషపూరితమైన అనుబంధంలో ఉన్నా. అయితే ఆ వ్యక్తి పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. ఆ బంధంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ, అది నేను ఊహించుకున్నంత అందంగా లేదు’’ అని అంజలి తెలిపింది.
అనంతరం ఆమె కోలీవుడ్ నటుడు, ‘జర్నీ’ ఫేమ్ జైతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘ఇండస్ట్రీలోని ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్లు నేను ఇప్పటివరకూ ఎక్కడా చెప్పలేదు. ఇండస్ట్రీలో నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. నేను ఎవరితో స్నేహంగా ఉంటాననేది నా వ్యక్తిగత విషయం. అమెరికాకు చెందిన ఓ వ్యక్తితో నాకు పెళ్లి అయిపోయిందని ఇటీవల వార్తలు వచ్చాయి. అందులో ఎలాంటి నిజం లేదు. ఆ వార్తలు చూసి నేనే నవ్వుకున్నాను. పెళ్లి చేసుకోవాలని ఉంది. నన్ను అన్నివిధాలుగా గౌరవించే మంచి వ్యక్తి దొరికినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటా’’ అని అంజలి క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటి వరకు సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేసిన అంజలి ఇప్పుడు డిజిటల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. ఝాన్సీ, ఫాల్ వంటి వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల అంజలి ఎక్కువగా థ్రిల్లర్, హార్రర్ సినిమాలపై ఫోకస్ చేస్తోంది. గీతాంజలి, లీసా, చిత్రాంగద వంటి సినిమాలతో అంజలి ప్రేక్షకులను స్ట్రాంగ్ గానే భయపెట్టింది. ప్రస్తుతం అంజలి వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా ఉంది.