Alitho Saradaga : ఆలీతో సరదాగా.. ఈ షో గురించి తెలియని వారుండరు. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షో 300 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. కమెడియన్ ఆలీ ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే 300వ ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షోకు ఇక ఫుల్స్టాప్ పెట్టనున్నారు. అందుకే చివరి(300) ఎపిసోడ్‌ను కాస్త స్పెషల్‌గా డిజైన్ చేశారు. స్పెషాలిటీ ఏంటంటే తన షోకి గెస్టుగా తానే వచ్చారు ఆలీ. గెస్టు ఆలీ అయితే మరి హోస్టు ఎవరంటారా..? ఇంకెవరు టాలీవుడ్లో ది బెస్ట్ యాంకర్ అనిపించుకున్న సుమ కనకాల.
ఇన్నాళ్లూ గెస్టులను రోస్ట్ చేసిన ఆలీని ఈసారి యాంకర్ సుమ రోస్ట్ చేసింది. 300వ ఎపిసోడ్‌కు గెస్ట్ హోస్టుగా వచ్చి ఆలీని గెస్టుగా మార్చి ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆలీతో చాలా విషయాలు చెప్పించింది సుమ. తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది.. ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు.. కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా ఎలా మారారు.. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎందుకు వచ్చారు.. పవన్ కల్యాణ్‌తో గొడవ ఏంటి.. ఇలా ఆలీని చాలా రకాల ప్రశ్నలను అడిగారు సుమ. వీటన్నింటి కంటే ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగింది సుమ. అదేంటంటే..?
300 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి చాలా మంది గెస్టులు వచ్చారు. కొందరు స్నేహితులు, మరి కొందరు ప్రేమికులు.. ఇంకొందరు కో యాక్టర్లు.. కొందరేమో భార్యాభర్తలు.. ఇలా జంటగా.. సోలోగా చాలా మంది గెస్టులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి గురించి.. వారి లైఫ్ గురించి.. వారి జీవితంలో చూసిన కష్టనష్టాలు.. సుఖదుఃఖాలు ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు.
కొన్నిసార్లు వారి గురించి మీడియాలో వస్తున్న పుకార్ల గురించి కూడా ఆలీ ప్రశ్నలు వేశారు. కొన్ని వివాదాల గురించి కూడా చర్చించారు. ఇలా ఎంతో మంది గెస్టులను ఇంటర్వ్యూ చేసిన ఆలీకి తానే గెస్టుగా వచ్చిన సందర్భంలో సుమ ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగింది. 300 ఎపిసోడ్లలో ఆలీకి బాగా నచ్చిన ఎపిసోడ్ ఏంటని అడిగింది. దీనికి ఆలీ తడుముకోకుండా సమాధానం ఇవ్వడం గమనార్హం.
“బాల సుబ్రహ్మణ్యం గారు, పూరిజగన్నాథ్, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, మోహన్‌బాబు, బ్రహ్మానందం ఇలా గొప్ప నటులు, దర్శకులని ఇంటర్వ్యూ చేసే అవకాశం రావడం నా అదృష్టం. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల నాకు ఈ అవకాశం లభించింది. నేను మంచి చేస్తే.. అది నా పిల్లలకు వస్తుంది.” అని ఆలీ సమాధానం ఇచ్చారు. బాలుతో ఏకంగా రెండు ఎపిసోడ్లు చేశారు. ఇక పూరీ జగన్నాథ్ ఓ వ్యక్తి చేతిలో మోసపోవడం.. అల్లు అరవింద్ – మెగాస్టార్ మధ్య వివాదం నడుస్తోందనే పుకార్లు.. ఇలా చాలా విషయాల గురించి ఆయా ఎపిసోడ్లలో ఆలీ సదరు గెస్టులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.