Director Vamshi మనసు మార్చిన సినిమా ఏంటో తెలుసా..?

- Advertisement -

Director Vamshi సినిమా అంటే ఆయనకు ప్రేమ. డైరెక్టర్​గా ఆయన అరడజనుకుపైగా సినిమాలు చేసినా.. ఒక్క సినిమా మాత్రం ఓ దర్శకుడిగా తన శైలినే మార్చిందట. ఇప్పటి వరకు తెలుగు తెరపైనే తన సినిమాలు చూపించినా ఆ దర్శకుడు.. ఈసారి ఓ అడుగు ముందుకేసి తమిళులకు తన సత్తా ఏంటో చూపించారు. అతడే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి.

బృందావనం, ఎవడు, ఊపిరి, మహర్షి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి.. ఇటీవల వారసుడు సినిమాతో వారిసుగా తమిళ ఇండస్ట్రీలోనూ అడుగుపెట్టారు. తమిళనాడులో చాలాఏళ్ల తర్వాత కుటుంబ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడాయనే ప్రశంసలు ఓ దర్శకుడిగా ఎంతో తృప్తినిచ్చాయని వంశీ పైడిపల్లి చెప్పారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్ని తీసిన ఆయన… ఇటీవల తమిళంలో విజయ్‌ కథానాయకుడిగా ‘వారిసు’ తెరకెక్కించారు. ఆ చిత్రం తెలుగులో ‘వారసుడు’గా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Director Vamshi
Vamshi Dil Raju and vijay

‘‘కథే కథానాయకుల్ని వెదుక్కుంటూ వెళుతుందనే మాటని బలంగా విశ్వసిస్తా. మహేష్‌బాబు కోసం ‘మహర్షి’ తర్వాత ఓ కథ అనుకున్నా అది సాధ్యపడలేదు. అప్పుడే ‘ఇలా మరో కథ అనుకున్నాం’ అని నిర్మాత దిల్‌రాజుకి చెప్పగానే ఆయన విజయ్‌ పేరు సూచించారు. మా ప్రణాళికలో లేని ఆలోచన అది. ఈ రోజుల్లో సినిమాలకి హద్దులంటూ ఏమీ లేవు. అదే మరోసారి రుజువైంది.

- Advertisement -

మొదట షాక్‌గా అనిపించినా, దిల్‌రాజు చెప్పినట్టుగానే విజయ్‌కి ఈ కథ వినిపించాం. ఈ కథని ఒప్పుకున్నాక అప్పుడు ఆయన బలాల్ని అంచనా వేసుకుని, ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌ని తీర్చిదిద్దాం. గత చిత్రాల్లో విజయ్‌ ఎలా కనిపించారో, అలా ఇందులో ఆయన్ని చూపించాలనేది మా ప్లాన్‌. దానికితోడు ఆయన స్టైల్‌ పాటలు, ఫైట్లతో పక్కాగా ఓ కమర్షియల్‌ సినిమా చేశాం. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఎంతో తృప్తినిస్తోంది. యువతరం వెళ్లి ఇంట్లోవాళ్లకి ఈ సినిమాని చూడండని చెబుతున్నారు. హిందీ, తెలుగు భాషల్లోనూ సినిమాకి ఆదరణ లభిస్తుండడం చాలా ఆనందంగా ఉంది’’. అని చెప్పుకొచ్చారు వంశీ.

‘‘కథానాయకుల్లో ఒకొక్కరిది ఒక్కో పంథా. విజయ్‌ వారం రోజుల ముందే స్క్రిప్ట్‌ చూసుకుంటారు. సన్నివేశాలు, డ్యాన్స్‌ విషయంలో రిహార్సల్స్‌ చేస్తారు. అదే  ఆయన బలం. చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ‘దర్శకుడిగా మీరు  హ్యాపీనా?’ అని అడుగుతుంటారు. సినిమా విడుదల తర్వాత కలిసినప్పుడు ‘మీరు హ్యాపీనా సర్‌’ అని అడిగా. నేను చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. ఓ దర్శకుడికి అది చాలు కదా. భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటున్నాయి. తండ్రీ కొడుకుల బంధాన్ని ఆవిష్కరించిన విధానాన్ని చూసి, చివర్లో లేచి వస్తున్నప్పుడు కూడా చప్పట్లు కొడుతూ కళ్లు తుడుచుకుంటూ వస్తున్నారు. తమన్‌ సంగీతం సినిమాకి ఆత్మలా నిలిచింది’’. అని వంశీ అన్నారు.

‘‘దర్శకుడిగా నా శైలి మారిందంటే ‘ఊపిరి’ సినిమా నుంచే. అంతకుముందు సినిమాల అనుభవం ఆ సినిమాకి పనికొచ్చింది. ఆ సినిమానేమో నా ఆలోచనా ధోరణినే మార్చింది. అందుకే ‘మహర్షి’, ‘వారసుడు’ చిత్రాలొచ్చాయి. చిన్నప్పట్నుంచి అగ్ర తారలు నటించిన వాణిజ్య ప్రధానమైన సినిమాలు చూస్తూ పెరిగాను. నేను పరిశ్రమకి అలాంటి సినిమాలు తీయడానికే వచ్చా. ‘వారసుడు’ విడుదల కాక ముందే విజయ్‌ నాతో మరో సినిమాకి చేయడానికి సిద్ధమని ప్రకటించారు. అదెంతో తృప్తినిచ్చింది. మా ప్రయాణం కచ్చితంగా కొనసాగుతుంది.

ఇప్పుడు ప్రతి దర్శకుడూ తను చేస్తున్న సినిమాని చివరి ఇన్నింగ్స్‌లాగే భావిస్తున్నాడు. ప్రతి సినిమా ఓ సవాలే. అంతకుముందు సినిమా కంటే ఉత్తమంగా ఉండాలి, దర్శకుడిగా మమ్మల్ని మేం  నిరూపించుకోవాలి. ప్రస్తుతానికి ‘వారసుడు’ సినిమా ఫలితాన్ని ఆస్వాదిస్తున్నా. తర్వాత మరో కొత్త సవాల్‌తో కొత్త ప్రయాణం మొదలుపెడతా’’. అని చెప్పారు వంశీ పైడిపల్లి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here