Triple Role : సాధారణంగా వెండితెరపై ఫేవరెట్ హీరో కనిపిస్తే అభిమానుల సందడి మామూలుగా ఉండదు. ఇక ఆ సినిమాలో హీరోది డ్యూయెల్ రోల్ అయితే ఆ సంబురం రెట్టింపవుతుంది. అదే ట్రిపుల్ రోల్ అయితే ఇక థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. మూడు రోల్స్ లో తమ ఫేవరెట్ హీరో కనిపిస్తూ.. అలరిస్తూ ఉంటే ఆ కిక్కు మామూలుగా ఉండదు కదా.
తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ మూవీ కూడా అదే కోవకు చెందింది. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో టాలీవుడ్ లో ఇలా ట్రిపుల్ రోల్ చేసి ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోలు ఎవరు.. ఏ హీరో ఎన్నిసార్లు త్రిపాత్రాభినయం చేశారో తెలుసుకుందామా..?
సీనియర్ ఎన్టీఆర్..
తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పాల్సి వస్తే అది మొదలయ్యేది నందమూరి తారక రామారావు పేరుతోనే. టాలీవుడ్ సినిమా చరిత్రలో అజరామరంగా నిలిచిపోయే పేరు ఎన్టీఆర్. ఎందరికో ఆరాధ్య నటుడు.. మరెందరికో ఆయన ఓ రోల్ మోడల్. తన డైలాగులతో, నటనతో సినిమాకు కొత్త అర్థాన్ని తెచ్చిన ఈ హీరో చాలా సినిమాల్లో ట్రిపుల్ రోల్ లో నటించారు. వాటిలో ‘కులగౌరవం’, ‘శ్రీకృష్ణసత్య’, , ‘దానవీరశూరకర్ణ’, సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక ఈ మహానటుడు మూడు కంటే ఎక్కువ పాత్రల్లో అలరించిన సినిమాలు కూడా సినీ చరిత్రలో ఉన్నాయి.‘శ్రీమద్విరాట పర్వం’ ‘శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర’ చిత్రాల్లో ఐదు పాత్రలు పోషించారు.
సూపర్ స్టార్ కృష్ణ
తెలుగు సినిమా చరిత్రలో డేరింగ్ హీరో అంటే గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన వెండితెరపై ఎన్నో ప్రయోగాలు చేశారు. కౌబాయ్ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన ఈ హీరో ఏకంగా ఏడు సినిమాల్లో మూడు పాత్రలతో అలరించారు. ‘కుమార రాజా’, ‘పగపట్టిన సింహం’, ‘రక్త సంబంధం’, ‘బంగారు కాపురం’, ‘బొబ్బిలిదొర’, ‘డాక్టర్ సినీ యాక్టర్’, ‘సిరిపురం మొనగాడు’ ఈ సినిమాల్లో ఆయన నటనకు ఎన్నో అవార్డులు వరించాయి.
శోభన్ బాబు..
తెలుగుప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడుగా గుర్తుండి పోయే నటుడు శోభన్ బాబు. ఇప్పటి వరకు ఇంత అందంగా ఉండే తెలుగు సినిమా చరిత్రలో లేడంటే నమ్మశక్యం కాదు. ఈ హీరో ఒక రీమేక్ సినిమాలో మూడు పాత్రలతో అలరించారు. తమిళంలో రజనీకాంత్ నటించిన ‘మూండ్రు ముగమ్’ సినిమాను 1983లో ‘ముగ్గురు మొనగాళ్లు’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో ఆంధ్ర సోగ్గాడు శోభన్‌బాబు మూడు పాత్రలతో మెప్పించారు.
మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ పేరుకు ఉండే వెయిటే వేరు. తన డాన్స్‌లతో ప్రేక్షకులను ఊరూత్రలూగిస్తారు మెగాస్టార్. తన డైలాగ్ డెలివరీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించారు. 1994లో విడుదలైన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో నటించారు.
కమల్‌హాసన్
విశ్వ నటుడు.. విలక్షణ నటుడు కమల్ హాసన్ తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ హీరో ‘విచిత్ర సోదరులు’ సినిమాలో మూడు పాత్రల్లో నటించి తన నటనతో ఔరా అనిపించారు. అలాగే ‘మైఖేల్ మదన కామ రాజు’లో నాలుగు పాత్రలతోనూ.. ‘దశావతారం’ సినిమాలో ఏకంగా పది పాత్రలతోనూ అలరించారు.
బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ తెరపై కనిపిస్తే అభిమానులకు పూనకాలు వస్తాయి. ఈ హీరో సినిమా ప్రకటించిన దగ్గరి నుంచి సినీ ప్రియులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఈ నందమూరి హీరో పరుచూరి మురళి దర్శకత్వం వహించిన ‘అధినాయకుడు’ సినిమాలో మూడు పాత్రల్లో నటించారు. తాత, తండ్రి, మనవడు ఇలా మూడు తరాల పాత్రల్లోనూ తన నటనతో బాలకృష్ణ ఆకట్టుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్..
పాన్ ఇండియా కాదు ఏకంగా పాన్ వరల్డ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రతి పాత్రలో సినిమాపై తనకున్న తపనను నిరూపించుకునే తారక్.. తాతకు తగ్గ మనవడిగా డైలాగులతో ధియేటర్లలో విజిల్స్ వేయిస్తారు. ఈ హీరో కె.ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వచ్చిన ‘జై లవకుశ’ సినిమాలో ట్రిపుల్ రోల్ చేసి మూడు పాత్రలకు ప్రాణం పోశారు.
సూర్య..
‘సింగం’ సినిమాలతో టాలీవుడ్ భారీగా అభిమానులను సంపాదించుకున్నారు నటుడు సూర్య. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ హీరో అలరించిన సినిమా ‘24’. ఇందులో సూర్య మూడు విభిన్న పాత్రల్లో కనిపించి.. విజయాన్ని సొంతం చేసుకున్నారు.
విజయ్..
తమిళ హీరో అయినా.. తెలుగులోనూ తన సినిమాలతో సందడి చేస్తుంటాడు ఇళయదళపతి విజయ్. ఈ హీరో నటించిన ‘మెర్సల్’ సినిమాను తెలుగులో ‘అదిరింది’ పేరుతో 2017లో విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ ట్రిపుల్ రోల్లో నటించిన సంగతి తెలిసిందే.