రష్మిక మందన్న.. క్యూట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్. తన అందం.. క్యూట్ నెస్ తో నేషనల్ క్రష్ అనే బిరుదుని సంపాదించుకుంది. వరుస సినిమాలు చేస్తూ సౌత్, నార్త్ సినీ ఇండస్ట్రీల్లో బిజీబిజీగా గడుపుతోంది. Rashmika Mandanna ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన కన్నడ ఇండస్ట్రీపైనే కాంట్రవర్సియల్ వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలతో మండిపడ్డ శాండల్ వుడ్ ఆమెను ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలని నిర్ణయించింది. తాజాగా ఈ సంఘటనపై డైరెక్టర్ నాగశేఖర్ రియాక్ట్ అయ్యారు.
కన్నడలో రష్మికపై బ్యాన్ విధిస్తే.. ఆ పరిశ్రమకే నష్టమని దర్శకుడు నాగశేఖర్ అన్నారు. తన తదుపరి చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రష్మిక వివాదంపై స్పందించారు. ‘‘ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. ‘సంజు వెడ్స్ గీత’ చిత్రాన్ని నేను తెరకెక్కించినప్పుడు అందులో కొంతమంది నటీనటులకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు వాళ్లు కెరీర్లో పెద్ద స్టార్స్ అయ్యారు. నా సినిమా తర్వాత వాళ్లు నన్ను గుర్తుపెట్టుకుంటారా? లేదా? అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం. నేను దాన్ని పట్టించుకోను. నా తదుపరి సినిమాపైనే ఫోకస్ పెడతా. ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం ఎక్కడో ఒకచోట బాధకు లోనవుతాం’’ అని అన్నారు.
అనంతరం రష్మికపై కన్నడ పరిశ్రమ బ్యాన్ విధించనుందంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘దాని గురించి నాకు తెలియదు. ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఈ విషయాన్ని నేను సపోర్ట్ చేయను’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తోన్న రష్మిక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ‘కిర్రిక్‌పార్టీ’తో తనకు మొదటి అవకాశాన్ని ఇచ్చిన నిర్మాణసంస్థ పేరు చెప్పడానికి ఆసక్తి కనబర్చలేదు. ఈ వీడియో బయటకు వచ్చిన సమయంలో అది చూసిన కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నటిగా నువ్వు ఈస్థాయిలో ఉన్నావంటే దానికి కారణం పరంవా నిర్మాణ సంస్థే. రక్షిత్ శెట్టికి చెందిన ఆ సంస్థ లేకపోతే నువ్వు నటివి అయ్యేదానివి కాదు. అలాంటి సంస్థ పేరు చెప్పడానికి ఎందుకంత పొగరు’’ అని మండిపడ్డారు.