పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఎంత మంచి ఊపు మీద ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జనసేన పార్టీ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన అన్నీ స్థానాల్లోనూ నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో ఘనవిజయం సాధించి అసెంబ్లీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ని చూసి అభిమానులు ఇప్పటికీ పండుగ చేసుకుంటూనే ఉన్నారు. మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా, నాలుగైదు ముఖ్య శాఖలకు మంత్రిగా పవన్ కళ్యాణ్ తన డ్యూటీ లో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చూపిస్తున్న దూకుడుని చూసి అభిమానులు కాస్త కంగారు పడ్డారు. ఈయన ఊపు చూస్తుంటే ఉన్న మూడు సినిమాలు పూర్తి చేస్తాడా లేదా అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి.
అయితే నేడు ఆ అనుమానాలకు చెక్ పడింది. నేడు పిఠాపురం లో పవన్ కళ్యాణ్ నిర్వహించిన బహిరంగ సభలో అభిమానులు పెద్ద ఎత్తున ఓజీ ఓజీ అని నినాదాలు చేస్తుండడం ని గమనించిన ఆయన, వాళ్లకి సమాధానం చెప్తూ ‘ఇప్పుడు ఉన్న సమయం లో సినిమాలు చేసే సమయం ఉందంటారా?, మాట ఇచ్చాను కాబట్టి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తాను. ముందు ఒక మూడు నెలలు కనీస స్థాయిలో అయినా నన్ను ప్రజాసేవలు చేసుకోనివ్వండి. నా నిర్మాతలకు కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మూడు నెలల తర్వాత తీరిక కుదిరినప్పుడల్లా వారానికి రెండు మూడు రోజుల కాల్ షీట్స్ ఇస్తాను అని, ఓజీ చూస్తారు లేండి, బాగుంటాది’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.
దీనికి అభిమానులు పండగ చేసుకుంటారు, సోషల్ మీడియా మొత్తం ఓజీ పేరు తో మారు మోగిపోయింది. అయితే ఈ చిత్రం ఈ ఏడాది లో వచ్చే అవకాశం లేదు అనేది ఖరారు అయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 70 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఓజీ కంటే ముందుగా హరి హర వీరమల్లు కి డేట్స్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తుంది.