Manchu Manoj : మంచు మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ కి యూత్ ఆడియన్స్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈయన సినిమాలకు ఆదరణ బాగా ఉండేది. కానీ మధ్యలో ఒక 5 సంవత్సరాలు సినిమాలకు బ్రేక్ ఇవ్వడంతో మంచు మనోజ్ ని ఆడియన్స్ దాదాపుగా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈ గ్యాప్ లో ఆయన తన మొదటి భార్య లక్ష్మి ప్రణతి తో విడాకులు తీసుకోవడం, ప్రముఖ రాజకీయ నాయకుడు భూమా నాగి రెడ్డి కూతురు భూమా మౌనిక తో ప్రేమాయణం నడిపి ఆమెతో కొన్నాళ్ళు డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవడం,అలాగే మధ్యలో తన సోదరుడు మంచు విష్ణు తో గొడవ పడడం వంటి సంఘటనల కారణంగా మళ్ళీ సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యాడు.
ఈమధ్యనే ఆయన సినిమాల్లోకి కూడా మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదంతా పక్కన పెడితే మనోజ్ భూమా మౌనిక కి ఇటీవలే ఒక ఆడబిడ్డ పుట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమెకి బారసాల కార్యక్రమం నేడే జరిగింది. ఆ చిన్నారి కి దేవసేన శోభా అనే నామకరణం చేసారు. ఈ కార్యక్రమానికి మంచు కుటుంబం మొత్తం హాజరు కాగా, మంచు విష్ణు మాత్రం డుమ్మా కొట్టాడు. ‘దేవసేన’ అనే పేరు వినగానే మన అందరికీ బాహుబలి సినిమాలోని అనుష్క గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో ఆమె పాత్ర పేరు అదే కాబట్టి. మనోజ్ అప్పట్లో తనకి కూతురు పుడితే ఈ పేరే పెడతానని తన సన్నిహితులతో కూడా అనేవాడట. చెప్పినట్టుగానే అదే నామకరణం చేసాడు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన హీరో గా ఒక సినిమా చేస్తుండగా, విలన్ గా ‘మిరాయ్’ అనే చిత్రం లో నటిస్తున్నాడు. తేజ సజ్జ ఈ చిత్రం లో సూపర్ హీరో గా నటిస్తుండగా, మనోజ్ సూపర్ విలన్ గా కనిపించనున్నాడు. ఈయన క్యారక్టర్ కి సంబంధించిన టీజర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కం బ్యాక్ కోసం సరైన సినిమాని ఎంచుకున్నావు అంటూ ఆయన అభిమానులు మంచు మనోజ్ కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.