ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో కూడా బన్నీ హవా మామూలుగా ఉండదు. ఒక్క ఫొటో పెడితే లక్షల లైకులు ఈజీగా వచ్చేస్తాయి. ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా బన్నీ నుంచి అని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా బన్నీ ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులకు వచ్చే లైకులకు కొదవేం ఉండదు.
అల్లు అర్జున్‌కి ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయన సతీమణి స్నేహా రెడ్డికి కూడా సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. బన్నీ కంటే కూడా స్నేహ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్నేహకు నేచర్ అంటే చాలా ఇష్టం. తన పోస్టుల్లో ఎక్కువగా ప్రకృతికి సంబంధించిన ఫొటోలు ఉంటాయి. స్టార్ హీరోయిన్స్‌కు సమానంగా స్నేహకు ఫాలోయింగ్ ఉంది. అందుకే ఏ పోస్టు పెట్టినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది.
తాజాగా అల్లు అర్జున్-స్నేహా ఆఫ్రికా టూర్‌కు వెళ్లారు. అక్కడ తమ స్నేహితురాలి పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఆ వేడుకలో ఈ జంట సందడి మామూలుగా లేదు. సహజంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహ ఈ వేడుకకి సంబంధించిన ప్రతి డీటెయిల్‌ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. అలా చేసిన పోస్టుల్లో ఓ పోస్టు తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఓ లుక్కేయండి..!
ఆఫ్రికాలో వివాహ వేడుకకు హాజరైన అల్లు అర్జున్-స్నేహ జంటకు అక్కడ తన ఫ్రెండ్స్ చాలా బహుమతులు ఇచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆ బహుమతులకు సంబంధించిన ఫొటోలను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. అందులో ఓ గిఫ్ట్ కార్డుపైన స్నేహ & అల్లు అర్జున్ రెడ్డి అని రాసి ఉంది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఎప్పుడూ లేనిది ఇదేంటి కొత్తగా “రెడ్డి” వచ్చి చేరిందని నెటిజన్లు ఆలోచనలో పడిపోయారు. బన్నీని పెళ్లి చేసుకుని అల్లు వారింట కోడలిగా అడుగుపెట్టిన స్నేహ తనను తాను స్నేహా రెడ్డిగానే పిలుచుకుంటోంది. తన పేరులో రెడ్డిని అలాగే ఉంచుకుంది. అయితే గిఫ్ట్ పంపిన వారు స్నేహ పేరులో రెడ్డి అల్లు అర్జున్ నుంచి వచ్చిందేనని భావించి అల్లు అర్జున్ రెడ్డి అని పెట్టి ఉంటారని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.
నార్త్ ఇండియన్స్ మన తెలుగు వారి పేర్లు, సంప్రదాయాలను అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి.. ఈ పొరపాటు జరిగి ఉండవచ్చొని నెటిజన్లు అనుకుంటున్నారు. అందుకే “అల్లు అర్జున్ రెడ్డి” గా సంబోధించి ఉండొచ్చని భావిస్తున్నారు.
అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ ప్రేమించుకొని 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్యమైన దాంపత్య జీవితానికి గుర్తుగా అల్లు అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్నేహా ఎప్పటికప్పుడు తన భర్త – పిల్లలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే పుష్పతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు పుష్ప-2 మూవీ కోసం రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ యాక్షన్ డ్రామా.. వచ్చే ఏడాది చివర్లో లేదా 2024 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.