Titanic Re Release : టైటానిక్.. ప్రపంచ సినిమా చరిత్రలో ఈ మూవీ ఓ సెన్సేషన్. అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన అభిమానాన్ని సొంతం చేసుకుంది. సినిమాలు చూసే ప్రతి ఒక్కరు ఈ మూవీ తప్పక చూసుంటారు. అవతార్ వంటి విజువల్ వండర్స్ తెరకెక్కించిన జేమ్స్ కామెరాన్ ఈ మూవీని 1997 తెరకెక్కించాడు. ఆ కాలంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లు కూడా సాధించింది.
సాధారణంగా తెలుగు ప్రేక్షకులను ఎవరినైనా మీరు ఫస్ట్ చూసిన ఇంగ్లీష్ మూవీ ఏంటంటే.. టక్కున చెప్పే పేరు టైటానిక్. ఇంగ్లీష్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ మూవీ ఏంటని అడిగితే వినిపించే పేరు టైటానిక్. మిమ్మల్ని బాగా సంతోషపెట్టి.. ఏడిపించిన చిత్రం ఏంటని అడిగితే వాళ్లిచ్చే సమాధానం టైటానిక్. అలా ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో టైటానిక్ మూవీ ఓ కల్ట్ చిత్రంగా నిలిచిపోయింది.
టాలీవుడ్ లో ఇప్పుడంతా రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఖుషి, ఒక్కడు, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు విడుదలై మళ్లీ రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ఈ రీ రిలీజ్ ట్రెండులో ఓ ఇంగ్లీష్ మూవీ కూడా చేరింది. అదే 90లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రొమాంటిక్ లవ్ స్టోరీ టైటానిక్. అవునూ టైటానిక్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారట.
టైటానిక్ సినిమాతోనే లియోనార్డో డికాప్రియో కేట్ విన్ స్లెట్ లకు భారీ క్రేజ్ ఏర్పడిందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వాళ్లిద్దరు వరుస హాలీవుడ్ సినిమాలతో అదరగొట్టారు. ముఖ్యంగా టైటానిక్ సినిమాలో కేట్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక సీన్ లో ఆమె ఒంటి మీద నూలుపోగు లేకుండా నటించడం అప్పట్లో ఒక సెన్సేషన్ గా మారింది. ఎన్నో అరుదైన రికార్డులు సాధించిన టైటానిక్ సినిమా మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది. అవును టైటానిక్ 4K ప్రింట్ రీ రిలీజ్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా టైటానిక్ రీ రిలీజ్ ఉండబోతుందని తెలుస్తోంది. మన హీరోల సినిమాల్లో ఒకటి రెండు రోజులు కాకుండా టైటానిక్ ను మళ్లీ సరికొత్త హంగులతో రీ రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవర్ 10న టైటానిక్ 4K వర్షన్ 3డిలో అందుబాటులో ఉంటుంది. ఈ సినిమా 3డి వెర్షన్ ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి టైటానిక్.. రీసెంట్ గా అవతార్ 2 తో మరోసారి తన సత్తా చాటిన జేమ్స్ కామెరాన్ టైటానిక్ రీ రిలీజ్ తో మళ్లీ వార్తల్లో ఉండనున్నారు.
టైటానిక్ సినిమా రీ రిలీజ్ అనగానే ఆ సినిమా చూసిన అప్పటి యూత్ ఆడియన్స్ కూడా మళ్లీ ఆ సినిమాను థియేటర్ లో చూడాలని ఉత్సాహపడుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే టైటానిక్ రీ రిలీజ్ కు ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ సినీ లవర్స్ అందరికి మరోసారి టైటానిక్ సినిమా అలరించనుంది.