.
Kaikala satyanarayana : సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ మరణంతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో Kaikala satyanarayana తలుచుకుంటూ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఆయనకు సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొందరు కైకాలతో ఉన్న బంధాన్ని, అనుభవాలను గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు, తన స్నేహితులు, ఫ్యామిలీ, రాజకీయాల గురించి కైకాల సత్యనారాయణ గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు. అవేంటో తెలుసుకుందామా..?
కైకాల తానొక తల్లిచాటు బిడ్డనని చెప్పుకునే వారు. తల్లిని మించిన దైవం లేదని మాటల్లో చెప్పడమే కాదు.. ఆచరణలో చూపించాలని అంటుండే వారు. అందుకే తనకు పెళ్లయి పిల్లలు పుట్టి వాళ్లు పెద్దవాళ్లయినా.. తనకు సినిమాల నుంచి వచ్చే డబ్బును, తన సంపాదనను తన తల్లికే ఇచ్చేవారట. తల్లితోనే కాదు తన పిల్లలతోనూ తనకున్న అనుబంధాన్ని ఈ కార్యక్రమంలో పంచుకున్నారు కైకాల. తనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలని.. కొడుకుల కంటే కూతుళ్లపై కాస్త ప్రేమ ఎక్కువని చెప్పుకొచ్చారు. ఇక తన రెండో కుమార్తె రమ పేరు మీద ఏకంగా ఓ బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు తీసినట్లు చెప్పారు.
మచిలీపట్నం నుంచి ఎంపీగా నిలుచున్నప్పడు అక్కడి ప్రజలు తనపై ఉన్న అభిమానం, గౌరవంతో 85,000 మెజార్టీతో పార్లమెంటుకు పంపించిన సంగతిని కైకాల గుర్తుచేసుకున్నారు. తాను విలన్ పాత్రలు చేసినప్పుడు చాలా మంది తనను చూసి భయపడేవారని సత్యనారాయణ చెప్పారు. కొందరు మహిళలైతే తాను కొన్ని సినిమాల్లో చేసిన పాత్రలు చూసి.. ఆ సత్తిగాడిని వెనక నుంచి పొడిచేయాలి అని మాట్లాడుకునే వారని తెలిపారు. ఇంకొందరైతే డైరెక్టుగా తన వద్దకు వచ్చి.. ఎందుకండీ ఆ అమ్మాయిని అంతగా ఇబ్బంది పెడతారంటూ అడిగేవారని చెప్పారు. తాను సినిమాల్లో చేసిన రేప్ సీన్ల వల్ల తనకు ఒకానొకదశలో రేపుల నారాయణ అని పిలిచేవారని చెప్పుకొచ్చారు కైకాల సత్యనారాయణ.
ఆలీ గురించి మాట్లాడుతూ.. నువ్వేం సామాన్య నటుడివి కాదు. చాలా ఎక్స్లెంట్ యాక్టర్ వి. పొట్టివాళ్లు చాలా గట్టివాళ్లని అంటారు కదా.. నువ్వు అలాంటి వాడివే. అని సత్యనారాయణ ఆలీ గురించి మాట్లాడారు. ప్రముఖ సినీ నటుడు గుమ్మడి, గిరిబాబును వారానికోసారి కలిసేవాన్నని.. ముగ్గురు కలిసి మాట్లాడుకుని.. కలిసి భోజనం చేసేవాళ్లమని చెప్పారు కైకాల. గుమ్మడి చనిపోయిన తర్వాత ఈ మీటింగ్ లు కూడా బంద్ అయ్యాయని తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇంటికి పిలిచేవారని గుర్తుచేసుకున్నారు కైకాల.