Rashmika Mandanna : అసలు నాతో మీకు ప్రాబ్లమేంటి..ట్రోలర్స్‌పై రష్మిక మందన్న ఫైర్నేషనల్ క్రష్ Rashmika Mandanna తన మొదటి సినిమా ఛలోతోనే టాలీవుడ్‌ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన గీతాగోవిందం, డియర్ కామ్రేడ్‌లతో ఈ బ్యూటీ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత వరుస అవకాశాలతో రష్మిక రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక పుష్ప సినిమాతో ఈ భామ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. పుష్పతో వచ్చిన క్రేజ్‌తో ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో అవకాశాలు రావడం మొదలయ్యాయి.

rashmika mandanna
rashmika mandanna

బాలీవుడ్‌లో గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాలు రిలీజ్ అయి రష్మిక హవా బాలీవుడ్‌లోనూ నడుస్తోంది. అయితే బాలీవుడ్‌లో ఓ ఇంటర్వ్యూలో కాంతారా సినిమా, తనకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన బ్యానర్ గురించి ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కన్నడ ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. అప్పటి నుంచి ఈ భామపై తెగ ట్రోలింగ్స్ వస్తున్నాయి. తాజాగా ఈ ట్రోలింగ్స్‌పై రష్మిక స్పందించింది.

‘‘సాధారణంగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో నాపై వచ్చే విమర్శల్ని నేనెప్పుడూ పట్టించుకోను. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. వాళ్లకు అనిపించింది వాళ్లు మాట్లాడుకుంటున్నారులే మనకెందుకులే అనుకుంటా. దానిపై మాట్లాడాలని కూడా అనుకోను. కానీ, అలా మౌనంగా ఉండటమే మొదటి నుంచీ నేను చేస్తున్న తప్పేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడా విమర్శలు నా కుటుంబాన్ని కూడా బాధ పెడుతున్నాయి. ఇది సరికాదు’’ అంది రష్మిక.

Rashmika Mandanna photos

ఇటీవల కాలంలో తనపై వస్తున్న విమర్శలపై ఆమె తాజాగా నోరు విప్పింది. ‘‘నాపై ఎన్ని విమర్శలొచ్చినా తీసుకుంటా. పట్టించుకోను. కానీ, ఇప్పుడా విమర్శల వల్ల నా కుటుంబం కూడా ప్రభావితమవుతోంది. ఎందుకంటే తన కూతురు గురించి మీడియాలో పదే పదే రకరకాల వార్తలు వినిపిస్తుంటే ఏ తల్లిదండ్రులైనా ఆందోళన చెందుతారు. మా ఇంట్లో వాళ్లు కూడా అప్పుడప్పుడు పిలిచి ‘ఏంట్రా నీపై ఇలా వార్తలొచ్చాయి.

మేము చూశాము. నిజమా’ అని అడుగుతుంటారు. ‘నేను మీ కూతుర్ని.. ఏదన్నా విషయం ఉంటే నేనే మీకు చెబుతా. అనవసరంగా ఆందోళన చెందకండ’ని చెబుతా. మా చెల్లి కూడా అప్పుడప్పుడు ‘అక్కా స్కూల్లో నా ఫ్రెండ్స్‌ అంతా నీ గురించి ఇలా అనుకుంటున్నారు. నిజమా’ అని అడుగుతుంటుంది. బాధగా అనిపిస్తుంది. ప్రస్తుతం తన మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా భుజాలపై ఉంది. ఆరేళ్లుగా ఇలాంటి విమర్శల్ని ఎదుర్కొంటూనే ఉన్నా.” అని చెప్పుకొచ్చింది.

“నేనిప్పటి వరకు ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు. నిజంగా నాపైనే ఎందుకిలా ఎటాక్‌ చేస్తున్నారో అర్థం కాదు. కొందరికి నా బాడీతోనూ సమస్యలున్నాయి. నేను ఎక్కువ వర్కవుట్‌ చేస్తే వాళ్లకు పురుషుడిలా కనిపిస్తా. చేయకుంటే లావుగా ఉన్నానంటారు. ఎక్కువ మాట్లాడితే భయపడుతోందంటారు. మాట్లాడకుంటే పొగరనుకుంటారు. నేను శ్వాస తీసుకోవడం.. తీసుకోకపోవడం కూడా వారికి సమస్యే అయితే నేనేం చేయాలి. వాళ్లు నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నారో.. వద్దనుకుంటున్నారో అర్థం కాదు. నిజంగా నాతో ఏదైనా సమస్య ఉంటే అదేంటో నాతో స్పష్టంగా చెప్పండి. వింటా. అంతే తప్ప దుర్భాషలాడొద్దు. అవి నన్ను, నా కుటుంబాన్ని మానసికంగా బాధపెడుతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేసింది రష్మిక. ఆమె ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప2’లో నటిస్తోంది.