Raayan Movie Review : విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూతలూ ఊగిస్తూ తమిళనాడు మాత్రమే పరిమితం కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ లలో కూడా ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసి, చివరికి హాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టిన నటుడు ధనుష్. ఈయనకి నేషనల్ అవార్డు కూడా దక్కిన సంగతి మన అందరికీ తెలిసిందే. నటుడిగా ఈ స్థాయి గుర్తింపుని సంపాదించిన ఆయన, రీసెంట్ గా ‘రాయన్’ అనే చిత్రం తో దర్శకుడిగా కూడా మారాడు. ఈ చిత్రం నేడు తెలుగు,తమిళ భాషల్లో గ్రాండ్ గా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యింది. మరి హీరో ధనుష్ దర్శకుడిగా కూడా మెప్పించాడా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాం.

కథ :
చెన్నై లోని అంజనాపురంలో కార్తవ రాయన్(ధనుష్) తన ఇద్దరి తమ్ముళ్లు ముత్తు రాయన్ (సందీప్ కిషన్), మాణిక్య రాయన్(కాళిదాసు జైరాం) మరియు చెల్లెలు దుర్గ (దుషర విజయన్) తో కలిసి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. చిన్నతనం నుండి వీరిని శేఖర్ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి చేరదీసి పెంచుతాడు. కర్తవ్యా రాయన్ కి తన చెల్లెలు అంటే పంచప్రాణాలు. ఇది ఇలా ఉండగా ఆ గ్రామం లో లోకల్ డాన్స్ గా సేతురామన్ (ఎస్ జే సూర్య), దురై (శరవణన్) చలామణి అవుతూ ఉంటారు.
వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. వీళ్ళ మధ్య గొడవల కారణంగా కార్తవ రాయన్ కుటుంబానికి ఎంతో నష్టం కలుగుతుంది. అందువల్ల వీళ్ళ వ్యవహారాల్లోకి కర్తవ్యా రాయన్ తలదూరుస్తాడు. ఇక అప్పటి నుండి ఎలాంటి మలుపులు తిరిగాయి?, కార్తవ రాయన్ కుటుంబానికి వీరిద్దరి వల్ల ఎలాంటి నష్టం జరిగింది?, ఎందుకు అతను వీళ్ళ వ్యవహారాల్లో తలదూర్చాల్సి వచ్చింది?, తన ఇద్దరి తమ్ముళ్లు కార్తవ రాయన్ కి ఎందుకు ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చాయి అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ :
ఈ సినిమా స్టోరీ లైన్ చాలా రొటీన్ గానే అనిపిస్తుంది. కానీ టేకింగ్ విషయం లో మాత్రం ఆడియన్స్ ని రెండు గంటలపాటు థియేటర్ లో కూర్చోబెట్టడంలో ధనుష్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. ప్రథమార్ధం అలా సాగిపోతూ ఉండగా, ఇంటర్వెల్ సన్నివేశం అద్భుతంగా ఉండడంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి కలుగుతుంది. సెకండ్ హాఫ్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా టేకింగ్ తో నిలబెట్టాడు. ధనుష్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇక మన టాలీవుడ్ లో యంగ్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సందీప్ కిషన్ ఈ చిత్రం లో ధనుష్ తమ్ముడిగా, మంచి రోల్ లో నటించాడు. కచ్చితంగా ఈ సినిమా ఆయనకీ ఉపయోగపడుతుంది అనే చెప్పాలి. ఇక విలన్స్ గా నటించిన ఎస్ జె సూర్య, శరవణన్ తమ పరిధిమేర అదరగొట్టేసాడు. ఇక సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. సాంగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. కంటెంట్ లేని ఎన్నో సన్నివేశాలను ఏ ఆర్ రెహ్మాన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పైకి లేపాడు. ఇవి థియేటర్స్ లో చూసేటప్పుడు మంచి అనుభూతిని ఇస్తుంది.
ఇక ఈ సినిమాకి బాగా మైనస్ అయ్యింది స్టోరీ. మన చిన్నతనం నుండి చూస్తే రొటీన్ రివెంజ్ స్టోరీ ని ధనుష్ తీసుకున్నాడు. ధనుష్ లో మంచి డైరెక్టర్ ఉన్నాడు అని ఈ సినిమా రుజువు అయ్యినప్పటికీ, రచయితా గా మాత్రం ఫెయిల్ అయ్యాడు అనే చెప్పాలి. స్టోరీ రొటీన్ అయ్యినప్పటికీ కూడా చూసేందుకు జనరంజకంగా ఉండడానికి నటీనటుల పెర్ఫార్మన్స్ కూడా ప్రధాన కారణం అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
చివరిమాట :
మాస్ మూవీ లవర్స్ కి కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. యాక్షన్ సన్నివేశాలు, అలాగే ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా పండాయి.
నటీనటులు: ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు జైరాం, అపర్ణ బాలమురళి, ఎస్ జే సూర్య, శరవణన్ తదితరులు.
దర్శకులు: ధనుష్
నిర్మాతలు : సన్ పిక్చర్స్
సంగీత దర్శకుడు: ఏ ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్
ఎడిటర్ : ప్రసన్న జీకే
రేటింగ్ : 2.75/5