Manushi chhillar : మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ గురించి తెలియని వారుండరు. ప్రపంచ అందాల వేదికపై భారతదేశం ఘనత చాటిన బ్యూటీ ఈమె. ఇక మోడలింగ్.. యాక్టింగ్ కెరీర్‌లు అన్నాదమ్ముల్లాంటివన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ బ్యూటీ అందాల కిరీటాన్ని గెలుచుకున్న వెంటనే బాలీవుడ్ డైరెక్టర్లు ఆమెపై మనసు పారేసుకున్నారు. అందుకే వెంటనే ఆఫర్లు ఇవ్వడం షురూ చేశారు.
అరంగేట్రంలోనే మానుషి చిల్లర్ బాలీవుడ్ స్టార్ హీరోతో జతకట్టింది. మొదటి సినిమాలోనే మహారాణి పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించింది. కానీ ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితేనేం ఈ బ్యూటీకి ఆఫర్లకు కొదువలేదు.
ఇటీవల సమ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలో తళుకున మెరిసింది మాజీ ప్రపంచసుందరి మానుషి చిల్లర్. ఆ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా ఈ బ్యూటీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న తర్వాత ఈ భామకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు దక్కాయి. ప్రస్తుతం జాన్ అబ్రహంతో కలిసి టెహ్రాన్ సినిమాలో నటిస్తోంది.
తాజాగా ఓ వార్తా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టింది. అదేంటంటే.. తనకు టాలీవుడ్‌లో ఓ దర్శకుడితో పనిచేయాలని ఉందని చెప్పింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
ఓ ఇంటర్వ్యూలో మానుషి తనకు ఇష్టమైన దర్శకుల గురించి మాట్లాడింది.‘‘ఫలానా వాళ్ల దర్శకత్వంలో నటిస్తే బాగుండు అని అందరికీ అనిపిస్తుంది. నా విషయానికొస్తే.. నేను చూసిన సినిమా ఏదైనా నాకు నచ్చితే.. ఆ డైరెక్టర్ వెంటనే నాకు ఇష్టమైన దర్శకుల జాబితాలో చేరతారు. ఆయన సినిమాలో నటించాలనిపిస్తుంది. అలా నేను అనుకున్న దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే నాకు డైరెక్టర్ రాజమౌళి అంటే చాలా ఇష్టం. ఆయన దర్శకత్వం బాగుంటుంది. ఆయన సినిమాలో నటించాలని ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా నాకు చాలా నచ్చింది’’ అని తన మనసులో మాటను మరోసారి బయటపెట్టింది.
అయితే రాజమౌళిపై మానుషి చిల్లర్ ప్రశంసలు కురిపించడం ఇదేం తొలిసారి కాదు. సమయం వచ్చినప్పుడల్లా రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటుంది ఈ సుందరి. తనను ప్రభావితం చేసిన వ్యక్తుల్లో రాజమౌళి ఒకరని ఆయన్ని చూసి ఎంతో స్ఫూర్తిపొందానని గతంలో చెప్పింది. అలాగే సమయం ఉన్నప్పుడల్లా రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తానని తెలిపింది. మరి ఈ మాజీ ప్రపంచ సుందరి కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలి.
ఇక ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు సరిగా అలరించలేకపోవడంపై స్పందించిన మానుషి..‘ఒక మంచి సినిమా వస్తే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని కంటెంట్ ఉన్న సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. దానికి కారణం కొవిడ్ మహమ్మారి. కరోనా కారణంగా కొన్ని మంచి సినిమాలు కూడా హిట్‌ను సొంతం చేసుకోలేకపోయాయి. కొవిడ్‌కు ముందు మొదలుపెట్టి రెండు సంవత్సరాల తర్వాత విడుదల చేసేసరికి అవి అంతగా అలరించలేకపోయాయని నేను అనుకుంటున్నాను’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఈ అందాల తార.