విక్టరీ వెంకటేశ్.. టాలీవుడ్లో కుటుంబ కథాచిత్రాల నాయకుడంటే గుర్తొచ్చే పేరు ఆయనదే. ప్రతి ఫ్యామిలీలో కనీసం ఒక్కరైనా వెంకీ ఫ్యాన్స్ ఉంటారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో రొమాన్స్‌ను పక్కన పెట్టి.. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు వెంకటేశ్. చాలా కాలం తర్వాత ఈయన ఓ యాక్షన్ మూవీతో సర్ప్రైజ్ చేయడానికి వస్తున్నారు. హిట్’ లాంటి విజయవంతమైన సిరీస్‌ను అందించిన శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ Saindhav పేరుతో వెంకీ తన 75వ సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది సైంధవ్ చిత్రబృందం.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో వెంకటేశ్ లుక్స్ అదిరిపోయాయి. రెండు నిమిషాలు ఉన్న సైంధవ్ గ్లింప్స్ వీడియోలో వెంకటేశ్ ఓ చేతిలో గన్ పట్టుకుని.. మరో చేతిలో ఓ ఇంజెక్షన్ పట్టుకుని కనిపిస్తూ ‘నేనిక్కడే ఉంటాను.. ఎక్కడికీ వెళ్లను..’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. ఈ గ్లింప్స్‌ను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే కొన్ని ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ గ్లింప్స్ చూశాక కమల్ హాసన్ ‘విక్రమ్’ స్టైల్లో వెంకీ లుక్ ఉందని, మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజీఎం కూడా ‘విక్రమ్’ టెంప్లేట్‌ను గుర్తు చేస్తోందని అంటున్నారు.
ఈ గ్లింప్స్‌లో ఇవి కాకుండా అందరి దృష్టిని ఆకర్షించింది ఒకటి ఉంది. అది వెంకీ స్టైల్ కాదు.. బీజీఎం కాదు.. వెంకీ చేతిలో ఉన్న గన్ కాదు.. అదేంటంటే ఇంజెక్షన్. ఓ చేతిలో గన్.. మరో చేతిలో ఇంజెక్షన్ పట్టుకున్న వెంకీని చూస్తే.. ఈ మూవీ స్టోరీ అంతా ఆ ఇంజెక్షన్ చుట్టే తిరుగుతుందని నెటిజన్లు భావిస్తున్నారు.
ఈ గ్లింప్స్‌లో మొదట వెంకీ బైక్ మీద ఉన్న ఓ బాక్స్ దగ్గరకు వెళ్తారు. ఆ బాక్స్ మీద ఓ సింబల్ ఉంది. దాని కింద Genezo అని రాసి ఉంది. ఇది జన్యువుల మీద పరిశోధనలు చేసే కంపెనీకి సంబంధించిన మెడిసిన్ బాక్స్! ఆ తర్వాత ఆ బాక్స్‌ను ఓపెన్ చేసిన వెంకీ.. లిక్విడ్ ఉన్న ఓ వయల్‌ను తీసి చేత్తో పట్టుకుంటారు. దాని మీద onasemnogene abeparvovec అని రాసి ఉంది. దీని గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. SMA (Spine Muscular Atrophy) అనే వ్యాథికి వాడే జీన్ థెరపీ మెడికేషన్ అని తెలిసింది. ఈ మెడిసిన్‌ను Zolgensma పేరుతో కూడా పిలుస్తారు.
ఈ ఇంజెక్షన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన డ్రగ్స్‌లో ఒకటి. దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ.16కోట్లు. మనం ఈ పేర్లతో గూగుల్ సెర్చ్ చేస్తే అనేక కథనాలు కూడా వస్తాయి. ఆ మధ్యలో చాలా మంది పసిపిల్లలు ఈ SMA వ్యాధితో పోరాడి కన్నుమూశారు. వారిలో చాలామందికి ఈ Zolgensma ఇంజెక్షన్‌ను అందించినా ఫలితం దక్కలేకపోయింది. కొంతమంది మాత్రం ఈ ఇంజక్షన్ ద్వారానే ప్రాణాలతో బయటపడ్డారు.
గ్లింప్స్‌లో వెంకటేశ్ ఈ డ్రగ్ ద్వారా ఎవరినైనా చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా?.. ఆ చిన్నారి ఆయన కూతురా? ఈ క్రమంలోనే విలన్లతో పోరాడతారా?.. అసలీ కథ ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుందా? అనేది తెలియాల్సి ఉంది. గ్లింప్స్‌లో డైలాగ్ కూడా… ‘నేను ఇక్కడే ఉంటాను రా, ఎక్కడికీ వెళ్లను.. అంటూ ఆ పక్కన చాలా మందిని అప్పటికే వెంకటేశ్ కొట్టి పడేసి ఉంటారు. మరి విషయం ఏంటనేది సినిమా వస్తే గానీ క్లారిటీగా తెలియదు.
ఇక ఈ సినిమా టైటిల్ కాస్త స్టైలిష్‌గా.. కొత్తగా అనిపిస్తోంది. కానీ ఇది మన పురాణాల నుంచి తీసుకున్న పేరే అని చాలా మందికి తెలియదు. మహాభారతం ప్రకారం కౌరవుల సోదరి దుస్సల భర్త పేరు సైంధవ్. అంటే.. దుర్యోధనుడికి బావ. సైంధవుడికి శివుడు నుంచి పొందిన ఓ వరం ఉంటుంది. అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులను అడ్డుకోగలిగే శక్తినిస్తాడు. ఆ వరం సాయంతో కౌరవులు.. పాండవులలోని అభిమన్యుడిని పద్మ వ్యూహంలోకి రప్పించి హతమారుస్తారు. ఆ సమయంలో సైంధవుడు.. మిగతా పాండవులని పద్మవ్యూహంలోకి వెళ్లకుండా అడ్డుకుంటాడు. అలా అభిమన్యుడి మరణానికి కారణమవుతాడు సైంధవుడు.
అయితే నెగెటివ్ క్యారెక్టర్ పేరు టైటిల్ రోల్‌కు ఎందుకు పెట్టారు? వెంకటేష్ పాత్రలో నెగెటివ్ షేడ్స్ చూపిస్తారా? లేదా సైంధవుడు అందరికీ ఎలా అయితే అడ్డు పడగలడో? అలా ఎవరినైనా ఎదిరించి అడ్డుపడగలిగే సామర్థ్యం ఉన్నవాడిగా చూపించేందుకు వెంకీకి ఆ పేరు పెట్టారా? అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది.
ఈ గ్లింప్స్‌ను ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్‌తో చూపించారు శైలేశ్ కొలను. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ తర్వాత దర్శకుడు శైలేశ్ ఓ ట్వీట్ చేశారు. “ఇది ట్రిబ్యూట్ మాత్రమే కాదు. నేను వెంకటేశ్ గారి కోసమే దర్శకుడిగా మారానని అనిపిస్తుంటుంది. ఆయన్ని ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చూపించాలని ఆశిస్తున్నాను. వెంకటేశ్, ఆయన అభిమానులు గర్వపడేలా శాయశక్తులా శ్రమించి ఈ సినిమా తీస్తా” అని అన్నారు.