Chiranjeevi : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓ కళాఅద్భుతం.. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం తెలుగు వారందరిని ఉబ్బితబ్బిబ్బుయ్యేలా చేస్తోంది.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు వైయస్ జగన్ , కేసీఆర్ లు ఆస్కార్ విజేతలకు అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా చరిత్రలో ఆస్కార్ దక్కించుకున్న మొదటి చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.. నాటు నాటు పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ విన్నర్ గా నిలవడంపై సిని ప్రముఖుల నుంచి రాజకీయ మంత్రులు వరకు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ విషయంపై చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. ఓ వీడియోను కూడా విడుదల చేశారు..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించడం పై తన సంతోషాన్ని తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన క్షణాలు ఇవి అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా గురించి తెలిసేలా చేసింది ఆర్ఆర్ఆర్ చిత్రం అని అన్నారు. దర్శకుడు రాజమౌళికి, సంగీత దర్శకుడు కీరవానికి, పాట రాసిన చంద్రబోస్ కి , పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవతో పాటు ఈ సినిమాలో ప్రాణం పెట్టి నటించిన తారక్, రామ్ చరణ్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ.. సెల్యూట్ చేస్తూ వీడియోను పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
చారిత్రాత్మక కీర్తిని భారతీయ సినిమాకు తీసుకువచ్చిన డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేకంగా అభినందిస్తున్నానని.. ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా ఒక భాగం కావడం తనతో పాటు తన కుటుంబానికి కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుందని.. ఈ విజయం మెగా ఫ్యామిలీకి గర్వకారణం అని చిరు అన్నారు. ఆస్కార్ ఇవ్వడం వెనుక క్రెడిట్ ఒక చరణ్ కు మాత్రమే కాదు అందరికీ చెందుతుంది అంటూనే.. ఆస్కార్ అవార్డు వచ్చేవరకు నాకు కూడా లో లోపల టెన్షన్ ఉందని.. ఎవరికైనా ఈ అవార్డు వెళ్తుందేమోనని టెన్షన్ పడ్డానని అన్నారు.
ఆస్కార్ రావడం వెనుక కృషి చేసిన ప్రతి ఒక్కరికి తన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. 8 దశాబ్దాలు దాటిన తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని ప్రపంచ స్థాయి గుర్తింపు ఆర్ఆర్ఆర్ కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. నాటు నాటు లైవ్ పెర్ఫార్మెన్స్ కి అందరూ స్టాండింగ్ ఇవ్వడం చూస్తే ఒళ్లంతా పులకించి పోయిందని చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.