క్రిస్మస్, సంక్రాంతి స్లాట్స్‌ని అగ్రనాయకులు బుక్ చేసేసుకున్నారు. అందుకే చిన్న సినిమాలన్నీ ఇప్పుడే థియేటర్లలోకి వచేస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద ప్రజెంట్ సందడంతా చిన్న సినిమాలదే. బడ్జెట్ మాత్రమే తక్కువ.. ఈ సినిమాల్లో కావాల్సినంత ఫన్, కంటెంట్ ఉంటున్నాయి. చిన్న మూవీస్‌గా రిలీజ్ అయినా.. సడెన్‌గా పెద్ద మార్కెట్ సంపాదించుకుంటున్నాయి. గత శుక్రవారం దాదాపు అరడజను సినిమాలు థియేటర్లో క్యూ కట్టాయి. అందులో ఒకటే ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్.’ పేరుతోనే నేటి మిలీనియల్ యూత్‌ని అట్రాక్ట్ చేసింది ఈ మూవీ టీమ్. గోల్కొండ హై స్కూల్‌తో అందర్ని ఆకర్షించి.. ఏక్ మినీ కథతో మెప్పించిన సంతోశ్ శోభన్ హీరోగా నటించిన మూవీ ఇది. ఇక సంతోశ్ పక్కన మన చిట్టి.. అదేనంటి జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్ధుల్లా నటించింది. ఇక ఈ ఇద్దరు సుదర్శన్, బ్రహ్మాజీలతో కలిస్తే సందడి మామూలుగా ఉండదుగా. వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వచ్చిన ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ స్టోరీ ఏంటి..? ఈ సినిమా ఎలా ఉంది..?
చిత్రం: లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్; నటీనటులు: సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, నెల్లూరు సుదర్శన్, బ్రహ్మాజీ, దయానంద్ రెడ్డి, మైమ్ గోపీ, గోవింద్ పద్మసూర్య, సప్తగిరి తదితరులు; సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల; రచన, దర్శకత్వం: మేర్లపాక గాంధీ; నిర్మాత: వెంకట్ బోయనపల్లి; విడుదల తేదీ: 04-11-2022
ఇదీ స్టోరీ: విప్లవ్ ఓ ట్రావెల్ వ్లాగర్. గువ్వ విహారి అనే యూట్యూబ్ ఛానెల్‌ను నడుపుతుంటాడు. రకరకాల ప్రాంతాలు తిరిగి వీడియోలు తీసి.. వాటిని తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. ఇలా తన వీడియోలతో మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్స్‌ను సంపాదించుకొని పాపులర్ యూట్యూబర్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలోనే ప్రకృతి అందాల్ని తన కెమెరాలో బంధించేందుకు అరకు వెళ్తాడు. అక్కడికి వసుధ (ఫరియా అబ్దుల్లా) కూడా వస్తుంది. ఆమె కూడా ఓ ట్రావెల్ వ్లాగరే. తన ఛానెల్‌కు 3మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. ఆమెనే విప్లవ్ కూడా స్ఫూర్తిగా భావిస్తుంటాడు. అంతేకాదు ఆమె పెట్టే ట్రావెల్ వీడియోలు చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. తొలుత విప్లవ్‌ను ద్వేషించిన వసుధ తర్వాత అతన్ని ఇష్టపడటం మొదలు పెడుతుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల వాళ్లు పీపుల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (పీపీఎఫ్) అనే ఓ నక్సల్ దళం చేతుల్లో చిక్కుతారు. మరి వీరికి నక్సల్స్‌కు ఉన్న సంబంధం ఏంటి? వాళ్లు వసుధ తండ్రిని ఎందుకు చంపాలనుకుంటుంటారు? వీరి నుంచి విప్లవ్, వసుధ ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? వీరి ప్రయాణంలో బ్రహ్మన్న (బ్రహ్మాజీ), జువ్వా దివాకరం (సుదర్శన్)ల పాత్రేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే: ఓ సీరియస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక చిత్రమిది. ఇందులో ఓవైపు నక్సల్ ఉద్యమానికి సంబంధించిన ఓ సీరియస్ కథ నడుస్తుంటుంది. మరోవైపు ఒక ట్రావెల్ వ్లాగర్స్ జంట సాగించే వినోదాత్మక ప్రయాణం కనిపిస్తుంటుంది. ఇలా రెండు విభిన్న ధ్రువాల్లాంటి నేపథ్యాల్ని సరైన రీతిలో మిక్స్ చేసి ఓ కథగా చెప్పాలంటే చాలా నేర్పు ఉండాలి. కథలోని సీరియస్‌నెస్‌ను.. వినోదాన్ని సరైన రీతిలో బ్యాలెన్స్ చేయలేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ సినిమా ఇటు వినోదం పంచలేక.. అటు థ్రిల్ చేయలేక రెండిటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది. ఈ ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ చిత్ర విషయంలో అదే జరిగింది. దర్శకుడు ఓ సీరియస్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకొని దాన్ని పూర్తి వినోదాత్మకంగా వడ్డించే ప్రయత్నం చేశాడు. అయితే ఇటు నక్సల్స్ కథలో సరైన సంఘర్షణ లేకపోవడం.. అటు విప్లవ్ – వసుధల కథలో సరైన వినోదం, భావోద్వేగాలు పండకపోవడంతో సినిమా గాడితప్పింది.
ఫస్ట్ హాఫ్ అంతా విప్ల్ ట్రావెల్ వ్లాగింగ్ కోసం అరకు వెళ్లడం.. అక్కడ వసుధను కలిసి ప్రేమ పేరుతో ఆమె వెంట తిరగడం.. వంటి రొటీన్ సీన్లు కనిపిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు వసుధ తండ్రిపై పీపీఎఫ్ నక్సల్స్ గ్రూప్ కాల్పులు జరపడం.. ఆ వెంటనే అరకులో విప్లవ్, వసుధ అనుకోకుండా పీపీఎఫ్ సభ్యులైన బ్రహ్మన్న (బ్రహ్మాజీ) బృందానికి చిక్కడంతో ద్వితీయార్ధం ఏం జరగనుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. బ్రహ్మన్న బృందంతో ప్రయాణం ప్రారంభించాక విప్లవ్, వసుధకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? పోలీసులకు నక్సల్స్‌కు మధ్య జరుగుతున్న పోరాటంలో ఎవరు పైచేయి సాధించారు? అన్నది సెకండాఫ్‌లో కీలకం. నిజానికి సీరియస్‌గా సాగాల్సిన ఈ సిల్లీ కామెడీ ఎపిసోడ్స్‌తో మరీ చప్పగా మార్చేశారు దర్శకుడు గాంధీ. ఇక క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్, సినిమాని ముగించిన తీరు ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించవు.
యాక్టింగ్ ఓకేనా : ట్రావెల్ వ్లాగర్ విప్లవ్ పాత్రలో సంతోష్ శోభన్ చక్కగా ఒదిగిపోయారు. ఆయన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. వసుధ పాత్రలో ఫరియా ఫర్వాలేదనిపించింది. కథలో ఆమె పాత్రను బలంగా తీర్చిదిద్దుకునే అవకాశమున్నా.. అంతగా వాడుకోలేదు. పీపీఎఫ్ దళ సభ్యుడు బ్రహ్మన్నగా బ్రహ్మాజీ, పైరసీ వీడియోగ్రాఫర్ జువ్వా దివాకరంగా సుదర్శన్ అక్కడక్కడా నవ్వులు పంచారు. మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకే ఉంటాయి. దర్శకుడు గాంధీ రాసుకున్న కథలో సరైన సంఘర్షణ కనిపించలేదు. సీరియస్‌గా సాగాల్సిన నక్సల్ నేపథ్యాన్ని జబర్దస్త్ కామెడీ స్కిట్‌లా మార్చేయడంతో ప్రేక్షకులు ఏ దశలోనూ వారి కథతో కనెక్ట్ కాలేరు. విప్లవ్, వసుధ ప్రేమకథలోనూ సరైన భావోద్వేగాలు కనిపించవు. రొటీన్ కామెడీ ట్రాక్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. పాటల్లో ఒకటి రెండు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఓకే అనిపించే స్థాయిలో ఉంది.