ఇటీవల విడుదలైన ‘బూ’ చిత్రంలో అలరించిన హీరోయిన్ మేఘా ఆకాష్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని సమాచారం. ఆమె పెళ్లిపై పలు వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. ఆమె ఓ రాజకీయ నాయకుడిని వివాహం చేసుకోనుందంటూ టాక్ నడుస్తోంది. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని.. ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని తెలిసింది. దీనిపై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
మేఘా ఇటీవలే తెలుగులో ‘రావణాసుర’, ఓటీటీలో ‘బూ’ మూవీల్లో నటించింది. అయితే, ఆ సినిమాలకు పెద్దగా బజ్ లేకపోవడం, అవకాశాలు కూడా తగ్గడంతో మేఘా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మేఘా పెళ్లి చేసుకోబోయే వరుడి గురించి అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయుడు, వ్యాపారవేత్త కొడుకును పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. మేఘా ఆకాష్ ఫ్యామిలీకి, ఆ రాజకీయ నాయకుడి కుటుంబానికి మధ్య చాన్నాళ్లుగా పరిచయాలు ఉన్నాయట. దీంతో వీరిద్దరి ప్రేమకు వీళ్ల కుటుంబీకులు అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే వీరి ఎంగేజ్మెంట్, పెళ్లి తేదీలను ప్రకటించనున్నారని తెలిసింది. ఈ విషయాన్ని మేఘా ఆకాష్, ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇక మేఘా ఆకాశ్.. నితిన్ హీరోగా నటించిన లై సినిమాతో 2017లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఛల్ మోహనరంగ, డియర్ మేఘ, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశంతో పాటు పలు తెలుగు సినిమాల్లో నటించింది. అటు తమిళంలో రజనీకాంత్ పేట, హిందీలో సల్మాన్‌ఖాన్ రాధే సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది మేఘా ఆకాష్. అవకాశాలు దండిగానే దక్కించుకున్నా పరాజయాల కారణంగా ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఇటీవలే రవితేజ రావణాసుర సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. ఇందులో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో నటించింది. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించిన మను చరిత్ర రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరికొన్ని తమిళ సినిమాల్లో నటిస్తోంది.