Siddharth, Aditi Rao Hydari : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రక్షితా రెడ్డితో శర్వా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ జంట నిశ్చితార్థ వేడుక గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఘనంగా జరిగింది. చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్ సతీసమేతంగా హాజరై కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నాని, రానా, అల్లరి నరేష్, నితిన్, శ్రీకాంత్, తరుణ్ తదితరులు సైతం ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. శర్వాకు కాబోయే భార్య రక్షిత సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి హైకోర్టు న్యాయవాది. తల్లి సుధారెడ్డి. పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
శర్వా ఎంగేజ్మెంట్ వేడుకలో అందరి దృష్టిని ఓ జంట బాగా ఆకర్షించింది. వాళ్లెవరో కాదు సిద్ధార్థ్-అదితీరావు హైదరీ. కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు తెగ వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు ఊతమిస్తూ తరచూ ఈ ఇద్దరు ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టడం.. సోషల్ మీడియాలో బహిరంగంగానే ఒకరిపై మరొకరి ప్రేమను చాటుకోవడంతో వాళ్ల రిలేషన్‌షిప్‌ను నెటిజన్లు కన్ఫమ్ చేశారు. కోలీవుడ్ టూ బాలీవుడ్ వయా టాలీవుడ్ ఈ పుకార్లు ప్రయాణించినా.. ఈ జంట ఇప్పటి వరకు వాటిని ధ్రువీకరించలేదు.. అలాగని కొట్టివేయనూ లేదు. ఈ లవ్‌బర్డ్స్ ప్రవర్తన ఒక రకంగా నెటిజన్లను డైలమాలో పడేసింది.
ఈ జంట త్వరలోనే పెళ్లికి కూడా రెడీ అవుతుందంటూ బీ టౌన్లో కథనాలు కూడా వచ్చాయి. కానీ ఈ ఇద్దరు ఇప్పటి వరకు తమ రిలేషన్షిప్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏమో.. చాలా మంది సెలబ్రిటీల్లాగే వీళ్లు కూడా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంటారో లేక.. పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాకింగ్ సర్ప్రైజ్ ఇస్తారో తెలియదు. అయితే ఈ జంట ప్రేమాయణం గురించి రకరకాల పుకార్లు వస్తున్న తరుణంలో.. ఈ లవ్ బర్డ్స్ తమ రిలేషన్షిప్ నిజమే అని చెప్పేలా ఓ పని చేశారు.
అదేంటంటే.. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్-రక్షితల ఎంగేజ్మెంట్ వేడుకకు కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో సిద్ధార్థ్- అదితీలే హైలైట్. అందరి కళ్లూ ఈ జంటపైనే ఉన్నాయని టాక్. ఆ వేడుకలో లైమ్ లైట్ అంతా ఈ జంటే లాగేసిందని సమాచారం. శర్వా నిశ్చితార్థ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ తెగ సంబురపడిపోయారు. అంతకంటే ఎక్కువ సిద్ధార్థ్ – అదితి ఈ వేడుకకు కలిసి రావడంతో ఖుష్ అయ్యారు. ఈ వేడుకలో లవ్‌బర్డ్స్ ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. క్యూట్ పెయిర్ అంటూ ట్యాగ్స్ చేస్తున్నారు.
సిద్ధార్థ్ – అదితి `మహాసముద్రం`లో శర్వాతో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే ఈ సిద్ధార్థ్ – అదితి ప్రేమలో పడినట్లు టాక్. గతంలో సిద్ధార్థ్ అదితితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటో కింద క్యాప్షన్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. అప్పుడే వీళ్లిద్దరు లవ్‌లో ఉన్నట్లు కన్ఫమ్ చేసుకున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ క్యాప్షన్ ఏంటంటే..`హృదయంలో యువరాణి` అని ప్రేమగా క్యాప్షన్ యాడ్ చేశాడు సిద్ధార్థ్. కొన్నాళ్లుగా సహజీవనంలో ఉన్నారన్న కథనాల నడుమ ఇప్పుడిలా శర్వా నిశ్చితార్థానికి కలిసి రావడంతో ఈ జంట తమ సంబంధాన్ని అధికారికం చేసినట్టేనని టాక్ వినిపిస్తోంది.