Jamuna : సావిత్రి – జమున ఏడాదిపాటు మాట్లాడుకోలేదట.. ఎందుకో తెలుసా..?Jamuna : సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు హీరోయిన్ల మధ్య తగువులు, వివాదాలు సాధారణం. ఈ కాలంలో కొందరు లోపల ఒకటి పెట్టుకుని బయటకొకటి మాట్లాడుతుంటారు. ఇంకొందరైతే సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ నటిస్తూ ఉంటారు. కానీ పాత కాలంలో అలాకాదు. అలనాటి తారల మధ్య స్నేహమైనా.. ప్రేమైనా.. కోపమైనా ముఖం మీదే ఉండేది.

అలా చాలా మంది హీరోయిన్లు ఒకప్పుడు చిన్న చిన్న విషయాల్లో అలగడం.. చిన్నిచిన్ని తగాదాలు పడటం చేశారు. అందులో జమున కూడా మినహాయింపేం కాదు. అయితే ఈ అలనాటి తార జమున.. మహానటి సావిత్రితో గొడవ పడ్డారట. గొడవ పడటమే కాదు.. ఏకంగా ఓ ఏడాదిపాటు మాట్లాడుకోలేదట. కారణమేంటో గతంలో ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు జమున. జమున కన్నుమూసిన నేపథ్యంలో ఆ పాత స్మృతులను ఓసారి గుర్తు చేసుకుందాం.

Jamuna with NTR and Savitri
Jamuna with NTR and Savitri

‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పు చేసి పప్పుకూడు’ వంటి చిత్రాల్లో అక్కాచెల్లెళ్లుగా నటించి తెలుగువారి మనసు దోచుకున్నారు సావిత్రి – జమున. సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లుగా ఉండేవారు. అయితే, వీళ్లిద్దరూ ఓ ఏడాది పాటు మాట్లాడుకోలేదట. ఈ విషయాన్ని గతంలో ఓసారి జమున స్వయంగా బయటపెట్టారు.

‘‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పు చేసి పప్పుకూడు’ వంటి చిత్రాల కోసం మేమిద్దరం అక్కాచెల్లెళ్లుగా నటించాం. దానివల్ల మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో ఆమె నన్ను చెల్లి అని పిలుస్తుండేది. నా పెళ్లికి ఆహ్వానిస్తే.. ఇంటికి వచ్చి నన్ను రెడీ చేసింది. మా ఇంట్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొంది. అయితే, ఓ సమయంలో కొంతమంది వ్యక్తులు మా మధ్య తగువు పెట్టారు. దాంతో దాదాపు ఓ ఏడాదిపాటు మేమిద్దరం మాట్లాడుకోలేదు. తర్వాత వివాదాలు సమసిపోయి మేమిద్దరం మళ్లీ కలిశాం. చివరిసారి చెన్నైలో ఆమె పరిస్థితి చూసి మనసు చలించిపోయింది’’ అని జమున చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో జమున తన జీవితంలో మరిచిపోలేని ఓ చేదు సంఘటన గురించి మాట్లాడారు. ‘‘నా సినీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు సంఘటన చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు అగ్రనటులు నాపై నాలుగేళ్లపాటు బహిష్కరణ (1959-63) విధించారు. నా అలవాట్లు వాళ్లకు నచ్చకపోవడం వల్లే నన్ను నిషేధించి ఉండొచ్చు. ‘పొగరుబోతు’, ‘టైమ్‌కి రాదు’, ‘కాలం విలువ తెలియదు’.. ఇవీ వాళ్లు చెప్పిన కారణాలు. విషయం తెలుసుకున్న పలువురు సినీ పెద్దలు రాజీ కుదిర్చి.. మేము మళ్లీ సినిమాల్లో కలిసి నటించేలా చేశారు’’ అని చెప్పుకొచ్చారు జమున.

‘‘గుండమ్మ కథ’ను నా కెరీర్‌లో ఓ అపురూప చిత్రం. ఆ సినిమాకు ముందు నాలుగేళ్లపాటు ఎన్టీఆర్‌ – ఏఎన్నార్‌లతో నేను మాట్లాడలేదు. మా మధ్య సయోధ్య కుదర్చడం కోసం కె.వి.రెడ్డిగారు, చక్రపాణి, నాగిరెడ్డి ప్రయత్నం చేశారు. ‘లేటుగా రాను. షూటింగ్‌కి ఒక అరగంట ముందే వస్తాను’ అని నన్ను లేఖ రాయమన్నారు. నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను. దాంతో వాళ్ల ప్రయత్నం విఫలమైంది. తర్వాత నేనే సమయానికి సెట్‌కు వస్తానని చెప్పా’’ అని జమున గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.