భర్త మోసం.. విడాకులకు సిద్ధమవుతున్న సానియా



 

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తన భర్త అయిన పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్‌ మీడియాలో వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. సానియా సోషల్ మీడియాలో చేసిన పోస్టులు సైతం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. టెన్నిస్‌లో వెలుగొందిన సానియా.. పాకిస్థాన్ దేశానికి చెందిన క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. 2003లో వీరిద్దరికి పరిచయమైంది. ఇద్దరు 2010 ఏప్రిల్‌లో ఒక్కటయ్యారు.

పెళ్లి సమయంలోనూ విమర్శలు ఎదుర్కొంది సానియా. 2018 అక్టోబరు 30న ఈ జంటకు ఇజహాన్‌ పుట్టాడు. ఇదంతా బాగానే ఉన్నా వారి మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. ఇటీవల దుబాయ్‌లో తమ కుమారుడి పుట్టినరోజు సెలబ్రేట్‌ చేసింది ఈ జంట. షోయబ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేయగా.. సానియా మాత్రం తాను, తన కొడుకు మాత్రమే కలిసి ఉన్న ఫొటో పంచుకుంది. దీనిపై సానియా బెస్ట్‌ ఫ్రెండ్‌, బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ స్పందించారు. ‘‘నీ జీవితంలో ఉన్న ఒకే ఒక, నిజమైన ప్రేమ.. ఇజహాన్‌తో నిన్ను చూసినప్పుడల్లా నాకిలాగే అనిపిస్తుంది’’ అని కామెంట్‌ చేశారు. ఇది పలు సందేహాలకు తావిచ్చింది.

అలాగే సానియా మీర్జా ఇటీవల పోస్ట్ చేసిన ఒక స్టోరీ సైతం దీనికి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో పోస్ట్‌లో విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి..? అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో వీరి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం మొదలైంది. భర్తను ఉద్దేశించే సానియా ఇలాంటి పోస్టులు చేస్తున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 12 ఏళ్ల పాటు అన్యోన్యంగా సాగిన వీరి ప్రయాణం ముగిసిందని.. త్వరలోనే విడాకులు తీసుకుంటున్నారని పాకిస్థాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొన్నాళ్లుగా విడిగా ఉంటున్న ఈ జంట.. కొడుకు కోసం మాత్రమే అప్పుడప్పడూ కలుస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నాయి. ఈ వదంతులపై ఈ జంట ఇప్పటివరకు స్పందించలేదు.