Ram Charan : చిరంజీవి సినిమా ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది. తన అద్భుత సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‍బాస్టర్లు, ఇండస్ట్రీ హిట్‍లు, రికార్డులు సృష్టించారు చిరంజీవి. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. అలాగే, సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు చిరంజీవి. కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 155 చిత్రాలు చేశారు చిరంజీవి. ఇప్పుడు 68 సంవత్సరాల వయసులోనూ వరుస సినిమాలతో ఫుల్ జోష్‍లో ఉన్నారు చిరూ.
ఈ ఏడాది కూడా 2 సినిమాలు చేశారు. ఈ క్రమంలో చిరంజీవి నట ప్రస్థానానికి 45 సంవత్సరాలు నిండాయి. చిరంజీవి నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’.. 1978 సెప్టెంబర్ 22న రిలీజ్ అయింది. ఆ చిత్రం విడుదలై నేటితో (2023 సెప్టెంబర్ 22) 45 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి సినీ జర్నీపై ఆయన తనయుడు రామ్‍చరణ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. “సినిమాల్లో 45 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రియమైన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అద్భుతమైన ప్రయాణం!.
ప్రాణంఖరీదుతో మొదలుపెట్టి.. ఇంకా మీ అద్భుతమైన పర్ఫార్మెన్సులు కొనసాగుతున్నాయి. తెరపై నటనతో.. బయట మానవతా కార్యక్రమాలతో.. రెండింటితోనూ కోట్లాది మందికి మీరు స్ఫూర్తిగా ఉంటున్నారు. మాలో క్రమశిక్షణ, కష్టపడేతత్వం, అకింతభావం, సమర్థత.. అన్నింటికన్నా దయాగుణం లాంటి విలువలను నింపిన మీకు ధన్యవాదాలు” అని రామ్‍చరణ్ ట్వీట్ చేశారు. చిరంజీవి నటించిన వివిధ పాత్రలకు సంబంధించిన ఫొటోలతో కూడిన పోస్టర్‌ను కూడా చరణ్ పోస్ట్ చేశారు.