Connect Review : హారర్ సినిమాలంటే ఇష్టపడని వారుండరు. భయపడినా.. భయం భయంతోనే ఓ దిండునో అడ్డుపెట్టుకుని సినిమా మొత్తం చూసేస్తుంటారు. సాధారణ సినిమాల గురించి మూవీ చూసిన తర్వాత చర్చిస్తారో లేదో కానీ.. హారర్ సినిమా చూసిన తర్వాత మాత్రం ఆ సీన్లో నాకు చాలా భయమేసింది అంటూ దాని గురించి మాట్లాడుకుంటారు. అందుకే ఎలాంటి సీజన్లో అయినా హారర్ సినిమాకు మినిమమ్ ఆడియెన్స్ ఉంటారు.
ఈ జానర్‌ను ఇష్టపడే వాళ్లను భయపెడితే చాలు అందులో కథ, కథనంపై వాళ్లెక్కువ ఫోకస్ చేయరు. ఇప్పటికే హారర్ జానర్లో చాలా సినిమాలొచ్చాయి. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ జానర్లో ఇప్పటికే చాలా సినిమాలు చేశారు. ఈసారి మరో హారర్ మూవీ కనెక్ట్‌తో మనముందుకొచ్చారు. ఈ మూవీకి ఆమె భర్త విఘ్నేష్ శివన్ ప్రొడ్యూసర్. ఇదివరకు పలు హారర్ చిత్రాలు తీసిన అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాకి మంచి ప్రచారం లభించింది. మరి అందుకు తగ్గట్టుగా సినిమా భయపెట్టిందా? లేదా? తెలుసుకుందాం..!
స్టోరీ ఏంటంటే..: జోసెఫ్ బెనాయ్ (వినయ్ రాయ్), సుసాన్ (నయనతార) భార్యాభర్తలు. ఆ ఇద్దరి ముద్దుల కూతురు అమ్ము (హనియా నసీఫా). చిన్నప్పట్నుంచి సంగీతం నేర్చుకుంటూ ఉంటుంది. ఆ ప్రతిభతో లండన్ హార్వర్డ్ మ్యూజిక్ స్కూల్‌లో సీటు సాధిస్తుంది. ఆ ఆనందంలో ఉండగానే వృత్తిరీత్యా వైద్యుడైన జోసెఫ్.. కొవిడ్ బాధితులకి చికిత్స అందిస్తూ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తండ్రి మరణంతో కుంగిపోతుంది అమ్ము.
మరణించిన తండ్రితో మాట్లాడాలని ఆన్‌లైన్‌లో వుయిజా బోర్డ్‌ని ఆశ్రయిస్తుంది. అది వికటించి ఆమెను దుష్టశక్తి ఆవహిస్తుంది. మరి తన కుమార్తె శరీరంలో ఓ ఆత్మ ఉందనే విషయం సుసాన్‌కి ఎప్పుడు తెలిసింది? తెలిశాక ఆ దుష్టశక్తి నుంచి అమ్ముని కాపాడేందుకు తన తండ్రి ఆర్ధర్ (సత్యరాజ్)తో కలిసి ఎలాంటి ప్రయత్నాలు చేసింది? అమ్మును కాపాడటం కోసం భూత వైద్యుడైన ఫాదర్ అగస్టీన్ (అనుపమ్ ఖేర్) ఏం చేశారు? అనేది మిగతా కథ.
మూవీ ఎలా ఉందంటే: ఆత్మ, భూతవైద్యం ఈ జానర్లో మూవీస్ మనకు కొత్తేమీ కాదు. చాలా ఏళ్లుగా చూస్తున్నవే. అయితే ఈ జానర్కో కరోనా, లాక్‌డౌన్‌ను జోడించడం కాస్త ఇంట్రెస్టింగ్ అంశం. డైరెక్టర్ అశ్విన్ పాత కథకు కరోనా అనే మహమ్మారిని కొత్తగా జోడించి ఈ మూవీ తీశారు. అది అక్కడక్కడా ఫలితాన్నిచ్చినా మొత్తంగా అనుభవం మాత్రం అంతంతమాత్రమే. కరోనా లాక్‌డౌన్ కాలాన్ని ప్రతిబింబించే సన్నివేశాలు సినిమాకి కీలకం. ఒకరినొకరు కలిసే వీలు లేకపోవడం, అందరూ సెల్‌ఫోన్లలో పలకరించుకోవడానికే పరిమితమైన పరిస్థితుల్ని ఈ కథకి బాగా కనెక్ట్ చేశాడు దర్శకుడు. సినిమా అంతా వీడియోకాల్‌లో సాగుతున్నట్టే ఉంటుంది.
కథ సాగే పరిధి నాలుగు గోడలకే పరిమితమైనా అందులో నుంచే భయం పుట్టించేందుకు ప్రయత్నించారు. అది అక్కడక్కడా సఫలమైంది కూడా. భావోద్వేగాలతో ఎక్కువగా ముడిపడిన ఈ కథ అర్ధంతరంగా ముగిసినట్టు అనిపించడం.. ఇందులో అమ్ముని ఆవహించిన ఆత్మకి బ్యాక్ స్టోరీ అంటూ లేకపోవడం వంటివి ప్రేక్షకుడికి పరిపూర్ణమైన అనుభూతిని ఇవ్వవు. ఒకట్రెండు భయపెట్టే సన్నివేశాలు మినహా కథలో కొత్తదనం లేదు.
యాక్టింగ్ ఎలా ఉందంటే: ఈ మూవీకి కాస్టింగే బలం, నయనతార, సత్యారాజ్, వినయ్ రాయ్ వంటి సూపర్ నటులను తీసుకుని సగం సక్సెస్ అయ్యారు డైరెక్టర్. నయనతార ఓ టీనేజ్ అమ్మాయికి తల్లిగా కనిపించి మెప్పించింది. ఆమె తన పాత్రలో ఒదిగిపోయారు కానీ, నటించేందుకు పెద్దగా ఆస్కారం దక్కలేదు. అమ్ముగా నటించిన హనియా నఫీసా నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ.
వినయ్ రాయ్ తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా తండ్రిగా ఎమోషనల్ సీన్స్‌లో కంటతడి పెట్టించాడు. సత్యరాజ్, అనుపమ్ ఖేర్ తదితర నటులు అత్యుత్తమ నటన ప్రదర్శించారు. సినిమాకి సాంకేతిక అంశాలు ప్రధానబలం. ముఖ్యంగా సౌండ్ డిజైన్, కెమెరా పనితనం ప్రాణం పోశాయి. దర్శకుడు అశ్విన్ శరవణన్ ఎంచుకున్న నేపథ్యం, ఆయన చిత్రాన్ని సహజంగా నడిపిన విధానం మెప్పించినా కంటెంట్‌లో బలం లేదు.
చిత్రం: కనెక్ట్
నటీనటులు: నయనతార, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, వినయ్ రాయ్, హనియా నఫిసా, తదితరులు;
సంగీతం : పృథ్వీ చంద్రశేఖర్;
సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహరన్;
కథ: అశ్విన్ శరవణన్, కావ్యా రామ్ కుమార్;
నిర్మాత: విఘ్నేష్ శివన్;
తెలుగులో విడుదల: యూవీ క్రియేషన్స్;
దర్శకత్వం: అశ్విన్ శరవణన్;
విడుదల తేదీ: 22-12-2022
కన్‌క్లూజన్ : ఈ సినిమాలో కరోనాకు మాత్రం ‘కనెక్ట్’ అవుతారు
గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
రేటింగ్ : 2.5/5