Indian Film Director : ప్రపంచ సినీ వేదికపై ఎస్ఎస్ రాజమౌళి ఎమోషనల్.. వాళ్లు లేకపోతే నేను లేనంటూ..



Indian Film Director : వరల్డ్ సినిమా వేదికపై భారతీయతను.. తెలుగు సినిమా సత్తాను చాటారు దర్శకధీరుడు.. జక్కన్న.. ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా స్టామినా ఏంటో ఇండియాలోనే కాదు యావత్ ప్రపంచానికి చాటారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో జక్కన్న ఇంటర్నేషనల్ స్థాయిలో ఫేం సంపాదించారు. ఈ దర్శకధీరుడి టాలెంట్‌ను.. కృషిని.. సినిమాపై జక్కన్నకు ఉన్న పిచ్చి ప్రేమకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

Indian Film Director
Indian Film Director

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డు జక్కన్నను వరించింది. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కుటుంబసమేతంగా జక్కన్న పాల్గొని.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీకిగానూ ఉత్తమ దర్శకుడి.రాజమౌళి గా ఈ అవార్డును అందుకున్నారు. సినీ ప్రియులు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు ధన్యవాదాలు చెప్పారు. తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు.

SS Rajamouli with family
SS Rajamouli with family

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వేదికపై అందరి ముందు నిల్చొని మాట్లాడటం కాస్త కంగారుగా అనిపిస్తోంది. నా దృష్టిలో సినిమా అంటే ఓ దేవాలయం. చిన్నప్పుడు థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్లినప్పుడు పొందిన ఆనందం ఇప్పటికీ గుర్తుంది. నేను ఏ సినిమా తీసినా ప్రతి సీన్‌ను చిత్రీకరించే ముందు.. ‘ఈ సీన్‌ థియేటర్‌లో ఎలా ఉంటుంది’ అని ఒక ప్రేక్షకుడిగా ఊహించుకుంటా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఆకట్టుకోవడం కోసం నేను సినిమాలు చేస్తుంటాను. కానీ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు వచ్చేసరికి భారతీయులు ఎలాంటి ప్రేమను చూపించారో.. అదే అభిమానాన్ని, ఉత్సాహాన్ని విదేశాల్లోనూ చూశా. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై విదేశీయులు సైతం అమితమైన అభిమానం చూపించారు. న్యూయార్క్‌, చికాగోకు వెళ్లినప్పుడు థియేటర్లలో వాళ్ల ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశా.’ అని రాజమౌళి అన్నారు.

Indian Film Director
Indian Film Director

“ఇక చిత్రబృందం మొత్తం నా కుటుంబం అంటూ ప్రతి ఒక్కరూ సాధారణంగా చెబుతుంటారు. కానీ, నా విషయంలో అది కాస్త భిన్నం. ఎందుకంటే నా సినిమాల కోసం పనిచేసే ముఖ్యమైన వ్యక్తులందరూ నా సొంత కుటుంబసభ్యులే. నేను తెరకెక్కించే సినిమాలకు నా తండ్రి (విజయేంద్రప్రసాద్‌) కథ రాస్తుంటారు. పెద్ద అన్నయ్య (కీరవాణి) సంగీత దర్శకుడిగా, నా సతీమణి (రమ) కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా‌, నా తనయుడు (కార్తికేయ), వదిన (వల్లి) లైన్‌ ప్రొడ్యూసర్లుగా, సోదరుడి కుమారుడు (కాలభైరవ) గాయకుడిగా, మరో సోదరుడు రచయితగా.. ఇలా వీళ్లంతా నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నన్ను అత్యున్నత స్థానంలో నిలపడం కోసం వారు కష్టపడుతున్నారు. నేను ఎలాంటి విజయాలు అందుకున్నా నా కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటా. అలాగే, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌, నా హీరోలు ఎన్‌.టి.రామారావు, రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు’’ అని జక్కన్న వివరించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు రాజమౌళి సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. భారతీయ చాటేలా ధోతీ-కుర్తా ధరించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Tags: