Jamuna : NTR, ANRలతో గొడవ.. అయినా జమున కోసం మూడేళ్లు ఎదురుచూశారట

- Advertisement -

Jamuna : కొంటె పిల్ల.. గడసరి అమ్మాయి.. అనుకువగల ఇల్లాలు.. తెగింపు గల సత్యభామ.. ఈ పేర్లు వినగానే తెలుగు ప్రేక్షకుల మదిలో మెదిలే పేరు ఒకటే.. ఆమే అలనాటి తార జమున. ఇవాళ ఉదయం ఆమె హైదరాబాద్​లోని స్వగృహంలో కన్నుమూశారు. జమున పేరు తలచుకోగానే గుర్తొచ్చే సినిమాల్లో ముందుంటుంది గుండమ్మ కథ. ఈ మూవీ ఆమెకు ఎనలేని కీర్తిని.. మరెన్నో అవకాశాలను తెచ్చిపెట్టింది.

ఈ సినిమా తెలుగు తెరపై కనువిందు చేసి 60 ఏళ్లైన సందర్భంలో గతంలో జమున ఓ ఛానెల్​కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్​లతో తనకు గల విభేదాలు.. గుండమ్మ కథ సినిమా విశేషాలు.. మరెన్నో సంగతులు పంచుకున్నారు. అవేంటో తెలుసుకుందామా..?

Jamuna
Jamuna

“సినిమా ఇండస్ట్రీలో ఆత్మాభిమానంతో బతకడం చాలా కష్టం. ముఖ్యంగా అమ్మాయిలు సెల్ఫ్ రెస్పెక్ట్ చూసుకుంటే అవకాశాలు తగ్గిపోతాయి. అలాగని అవకాశాల కోసం ఆత్మాభిమానం చంపుకోలేను నేను. ఆత్మాభిమానంతో ఉండాలనుకుంటే ఎవరితోనైనా గొడవలు వస్తాయి. నాగేశ్వరరావుతో ఇబ్బంది వచ్చి ఆయనతో సినిమాలు చేయలేదు.

- Advertisement -

ఏ రంగంలోనైనా ఆత్మాభిమానం పొగొట్టుకోకూడదు అనుకుంటే స్త్రీ తప్పక సమస్యల్ని ఎదుర్కొవాలి. గుండమ్మ కథలో సరోజ పాత్ర చేయాలని నా కోసం చక్రపాణి, నాగిరెడ్డి మూడేళ్లు ఎదురుచూశారు. ఓ రోజు నాగేశ్వరరావుతో నాగిరెడ్డి, చక్రపాణి, నేను సమావేశమయ్యాం. ‘నా గుండమ్మ మూడేళ్లుగా ఏడుస్తోందయ్యా.. చేయండి’ అని నాగేశ్వరరావుతో చెప్పారు. అందులో నేను చిలిపి అమ్మాయిగా చేసి ప్రేక్షకులను అలరించాను.” అని జమున చెప్పుకొచ్చారు.

Jamuna

“‘గుండమ్మ కథ’ సినిమా పేరు పెట్టినప్పుడు పెద్దగా స్పందన లేదు. ఎన్టీఆర్‌), ఏఎన్నార్‌తో అప్పటికే నాకున్న వివాదాన్ని ‘గుండమ్మ’ సినిమా కాంప్రమైజ్‌ చేసింది. ఆ హీరోలతో దాదాపుగా మూడేళ్లు నేను మాట్లాడలేదు. వేరే వాళ్లయితే మునిగిపోతారు.

నేను కాబట్టి వగరు, పొగరుతో మూడేళ్లు వాళ్లతో సినిమాలు చేయనని భీష్మించుకున్నాను. ఈ క్రమంలో జగ్గయ్య లాంటి వాళ్లతో సినిమాలు చేసి సూపర్‌హిట్‌ ఇచ్చా. పాత రోజుల్లో ఆత్మాభిమానం ఎక్కువ. కాంచనమాల, కన్నాంబ.. తర్వాత కృష్ణవేణి, వరలక్ష్మి తరం తర్వాత మేం వచ్చాం. ఒక్కొక్కరం 20, 30 ఏళ్లు నటించాం. ఇప్పటి హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.” అని అన్నారు జమున.

“ఏ పాత్ర సృష్టించినా దాని స్వభావం, తీరు తెన్నులను రచయిత గమనిస్తారు. ఆ పాత్ర ఎవరు చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తారు. సావిత్రి పొగరుగా నటిస్తే అంగీకరిస్తారా.. ఆమె పాత్రలు సాఫ్ట్‌గా ఉండాలి. జమున ఏడుపుగొట్టు పాత్రలు వేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? జమున సత్యభామలా ఉండాలనుకుంటారు. అలాంటి నటన జన్మతహః ఉండాలి. అప్పుడే పాత్రలో ఒదిగిపోతాం.” అని జమున చెప్పారు.

“నేను ఇంట్లోనూ రాణిలాగా ఉండేదాన్ని. ఎందుకంటే అమ్మా, నాన్న, తమ్ముడు, మరదలు మా ఇంట్లోనే ఉండేవారు. అంతా అమ్మా చూసుకునేది. ఆమెకు క్రమశిక్షణ ఎక్కువ. నా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేవారు. సూర్యకాంతం నాకు చాలా క్లోజ్‌. మంచి తల్లి అందరినీ బిడ్డల్లా చూసేది. సెట్‌లో అందరికీ భోజనం పెట్టేందుకు పెద్ద క్యారేజీ తెప్పించేది. దగ్గరుండి తినిపించేది.” అని జమున ఈ ఇంటర్వ్యూలో గుండమ్మ కథ సంగతులన్నీ చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here