Veera Simha Reddy : టాలీవుడ్ అగ్రనేత నందమూరి Balakrishna సంక్రాంతి బరిలో దిగి సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ‘అఖండ’ తర్వాత బాలయ్య నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలై పది రోజులు అయినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పదిరోజుల్లో రూ.140 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాలయ్య కెరీర్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా ‘వీరసింహారెడ్డి’ నిలిచిందని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. బాలయ్యకు వీరాభిమాని అయిన గోపీచంద్ మలినేని.. ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. బాలయ్య సరసన శ్రుతిహాసన్, మలయాళీ బ్యూటీ హనీరోజ్ నటించారు. నటసింహం చెల్లెలుగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించి ఆకట్టుకుంది.
వసూళ్లలోనూ.. ప్రేక్షకులను అలరించడంలోనూ దూసుకెళ్తున్న ఈ సినిమా విజయోత్సవ వేడుకలను హైదరాబాద్‌లో వీరసింహుని విజయోత్సవం పేరుతో నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ గోపీచంద్ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో బాలకృష్ణతో ఈ సినిమా చేయడం నా అదృష్టం. ఇంత మంచి అవకాశాన్నిచ్చిన కథానాయకుడు బాలకృష్ణకి రుణపడి ఉంటా. ఒక అభిమానిగా ఈ సినిమా చేశా. ఫ్యాన్ మూమెంట్స్, ఫ్యామిలీ మూమెంట్స్ ఇందులో ఉన్నాయి. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులవల్లే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది’’ అన్నారు.
వీరసింహారెడ్డి సినిమా ఊరమాస్ బ్లాక్ బస్టర్ కావడంపై బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘ఒక్కొక్కసారి ఒక్క డైలాగ్ నుంచి, ఒక్క మేనరిజమ్ నుంచే కథ పుడుతుంటుంది. దీనికి ఆద్యుడు మా బోయపాటి శ్రీను. గోపీచంద్ మలినేని నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలా అని ఆలోచించాం. అప్పుడే సీమ రక్తం కుతకుతలాడుతోందని అన్నా.
నా అభిమాని కాబట్టి గోపీచంద్ మలినేని వెంటనే ‘చెన్నకేశవరెడ్డి’ అన్నాడు. ఫ్యాక్షన్ నేపథ్యంలో అద్భుతమైన కథ చేశాడు. ఇది కథ కూడా కాదు, ఇదొక ప్రయాణం. తెలుగు ప్రేక్షకులతోపాటు, ఇతర భాషలకి చెందిన అభిమానులు కూడా ఈ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. మాటల్లోనూ, పాటల్లోనూ అద్భుతమైన పనితీరు కనబరిచారు సాయిమాధవ్ బుర్రా, రామజోగయ్యశాస్త్రి. తమన్ సంగీతం అద్భుతంగా ఉంది. ఒకొక్క పాట నా ఆహార్యానికి సరిపడేలా ఉంటుంది. ఇదొక విస్ఫోటనం అని చెప్పా. అన్నట్టుగానే ఈ సినిమా గొప్ప విజయం సాధించింది’’ అన్నారు.
2021లో బాలయ్య హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ సినిమా ఘనవిజయం సాధించింది. కొవిడ్ రెండో దశ తర్వాత విడుదలై.. థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చిన సినిమాగా అఖండ నిలిచింది. 2021 డిసెంబర్ 2న విడుదలైన అఖండ.. పది రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బాలయ్య కెరీర్లో తొలిసారి రూ.100కోట్లు సాధించిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు సృష్టించింది.
అంతేకాకుండా 2021 సంవత్సరానికి సంబంధించి ఓవర్సీస్లో అత్యధిక వసూళ్లు (గ్రాస్) సాధించిన చిత్రంగా నిలిచింది. ఓటీటీలోకి వచ్చి 24 గంటల్లోనే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ సాధించి అరుదైన రికార్డును నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలోనూ కలిపి రూ.53కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నేరుగా నాలుగు సెంటర్లలతో పాటు మొత్తంగా 20 కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులు ఆడింది. మొత్తంగా వంద రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.94.27కోట్లు షేర్, రూ.156కోట్లు గ్రాస్ వసూలు చేసింది.