Vijay Devarakonda : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న రియాక్ట్ అయింది. సమంతను ఎప్పటికీ తాను అమ్మలా రక్షించాలనుకుంటున్నట్లు చెప్పింది. సామ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను ఎప్పటికీ ఒక స్ఫూర్తిగా భావిస్తుంటానని అంది. ‘వారిసు’, ‘మిషన్ మజ్ను’ విడుదల సందర్భంగా తాజాగా రష్మిక ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తూ.. తన స్నేహితురాలు సమంత గురించి మాట్లాడింది. సామ్ మయోసైటిస్‌తో బాధపడుతోన్న విషయం ప్రకటించే వరకూ తనకు తెలియదని చెప్పింది.
‘‘సమంత అద్భుతమైన మహిళ. ఆమె ఎంతో దయ కలిగిన, అందమైన వ్యక్తి. ఒక అమ్మలాగా తనని ఎప్పుడూ సంరక్షించాలనుకుంటున్నాను. మయోసైటిస్ గురించి ఆమె ప్రకటించిన తర్వాతనే నాక్కూడా తెలిసింది. ఎందుకంటే, అంతకు ముందు తను ఎప్పుడూ ఆ విషయం గురించి మాట్లాడిన సందర్భాల్లేవు. జీవితంలో ఎన్నో సవాళ్లతో పోరాడి నిలబడిన వ్యక్తిని ప్రతి ఒక్కరూ ఏవిధంగా అయితే స్ఫూర్తిగా భావిస్తారో అదేవిధంగా నేను కూడా ఆమె నుంచి ప్రేరణ పొందుతున్నాను. ఆమెకు అన్నివిధాలుగా మంచే జరగాలని భావిస్తున్నా’’ అని రష్మిక తెలిపారు.
‘‘ప్రస్తుతానికి విజయ్ దేవరకొండతో నేను ఏ సినిమాలో నటించడం లేదు. ఈ ఏడాది లేదా, వచ్చే ఏడాది అయినా తనతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నా. మా ఇద్దరిని కలిపి స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నట్లు ఇప్పటికే పలువురు నుంచి మెసేజ్‌లు వచ్చాయి. వాళ్ల అభీష్టం కోసం మేము కూడా కలిసి సినిమా చేయాలనుకుంటున్నాం. అయితే మంచి స్క్రిప్ట్ రావాలి. మా ఇద్దరికీ సరిపడే కథ కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే తనతో వర్క్‌ని నేను ఇష్టపడతాను’’ అని చెప్పింది.
ఇక నిన్న చెన్నైలో వారిసు ప్రమోషనల్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో జానీ మాస్టర్ తో కలిసి రష్మిక.. రంజితమే సాంగ్ కు స్టెప్పులేసింది. ఈ ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఈవెంట్ లో హీరో విజయ్ మాట్లాడుతూ.. రష్మిక సినిమాలో ఎలా ఉందో.. బయట కూడా అలాగే ఉంటుందని చాలా యాక్టివ్ అని అన్నారు. రష్మిక చాలా ఇంటెలిజెంట్ యాక్టర్ అని చెబుతూ రష్మికకు దిష్టి తీశారు.