Veerasimha Reddy Review : నటసింహం నందమూరి బాలకృష్ణ.. గతేడాది అఖండ సినిమాతో అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అఖండ తర్వాత అంతకు మించిన సినిమాతో ఈ సంక్రాంతి బరిలోకి దిగారు బాలయ్య బాబు. వీరసింహారెడ్డిగా తన సింహా మల్టీవర్స్‌లో మరోసారి గర్జించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్, పాటలు ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో ఈ పండుగకు ప్రేక్షకులను అలరించడానికి ఇవాళ థియేటర్లోకి వచ్చాడు మన వీరసింహారెడ్డి. మరి బాలయ్య బాబు యాక్షన్‌కు ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారా..? ఈసారి కూడా ఈ సింహం గర్జించిందా..? ఈ సింహగర్జన ప్రేక్షకుల మనసు దోచిందా తెలుసుకుందామా..?
రేటింగ్: 3/5
స్టోరీ ఏంటంటే..?.. వీరసింహారెడ్డి సినిమా అన్నాచెల్లెళ్ల మధ్య వైరంతో సాగే కథ. వీరసింహా రెడ్డి(బాలకృష్ణ), భానుమతి(వరలక్ష్మీ శరత్‌కుమార్) ఇద్దరూ ఒకే తండ్రి పిల్లలు. అయితే తల్లులు వేరు. అయినా వీరసింహారెడ్డికి చెల్లెలంటే ఎంతో అభిమానం. కానీ, ఆ చెల్లెలు మాత్రం అన్నయ్యను ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటుంది. కారణం.. ఆమె ప్రేమించినవాడిని వీరసింహారెడ్డి చంపించాడని అనుకుంటూ ఉంటుంది. తన ప్రేమను తనకు దూరం చేసిన అన్నపై పగ సాధించడానికి భానుమతి వీరసింహారెడ్డి శత్రువైన ప్రతాప్ రెడ్డిని పెళ్లాడుతుంది. చెల్లెలు తనను ఎంత ద్వేశించినా ప్రతి ఏడాది ఆమెకు పంపాల్సిన సారె పంపుతూనే ఉంటాడు వీరసింహారెడ్డి.
కొన్నిరోజుల తర్వాత సడెన్‌గా విదేశాలకు వెళ్తాడు. రాయలసీమలో వీరసింహారెడ్డిని చంపడం కష్టమని భావించిన భానుమతి.. ఫారిన్లో అయితే ఈజీగా ఉంటుందని.. అక్కడికి వెళ్తుంది. ఒకరోజు వీరసింహారెడ్డిని కత్తితో పొడిచేస్తారు. అయితే భానుమతి తనే చంపేశానని.. తన పగ తీర్చుకున్నానని సంతోషిస్తుంది. అంతటితో భానుమతి పగ తీరినట్లేనా..? అసలు వీరసింహారెడ్డిని పొడిచిందెవరు..? వీరసింహారెడ్డి బతికే ఉన్నాడా..? ఆయన ప్రేమను చివరి వరకైనా భానుమతి గుర్తించగలిగిందా.. అసలు ఈ అన్నాచెల్లెళ్ల స్టోరీ ఏంటి..? ఇందులో శ్రుతి హాసన్ పాత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..? ఫ్యాక్షన్ డ్రాప్లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అందులో చాలా మూవీస్ బాలకృష్ణవే ఉన్నాయి. అయితే ఈసారి బాలయ్య ఫ్యాక్షన్‌కు కాస్త సిస్టర్ సెంటిమెంట్ టచ్ ఇచ్చారు. ఫ్యాక్షన్ డ్రాప్లో బాలకృష్ణను మించి నటించే వాళ్లెవరూ లేరన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆయనే బలం. మరోవైపు అఖండతో బ్లాక్‌బస్టర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తమన్ ఈసారి అంతకుమించి బీజీఎం ఇచ్చాడు. బాలయ్య డైలాగ్స్, ఫైట్స్‌కు తమన్ బీజీఎం తోడైతే ఉంటది.. ఆహా థియేటర్లు దద్దరిల్లిపోయాయి అంతే. పాత కథే అయినా బాలయ్యలో సిస్టర్ సెంటిమెంట్ యాంగిల్‌ని కొత్తగా చూపించారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని.
ఒక అభిమానిగా.. తన ఫేవరెట్ హీరో ఎలాంటి సినిమా చేస్తే ఫ్యాన్స్ దిల్ఖుష్ అవుతుందో అలాంటి మూవీనే ఈ సంక్రాంతికి గోపీచంద్ కానుకగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్ మాత్రం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసినట్టుగా అనిపిస్తాయి. ఇక సాయిమాధవ్ బుర్రా రాసిన డైలాగ్స్ థియేటర్లు విజిల్స్ కొట్టిస్తాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్. గాడ్ ఆఫ్ మాసెస్ అంటే ఏంటో సాయిమాధవ్ కలం.. బాలయ్య యాక్షన్ కలిస్తే అర్థమవుతుంది అనేది ప్రూవ్ చేశారు.
యాక్టింగ్ ఎలా ఉందంటే.. నటీనటుల్లో బాలకృష్ణదే అగ్రంతాంబూలం. ఫ్యాక్షనిజం నేపథ్యమున్న కథల్లో నటించి అలరించడం ఆయనకు కొట్టిన పిండి. అదే తీరున వీరసింహారెడ్డిగా, ఆయన కొడుకుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. వీరసింహారెడ్డి చెల్లెలు భానుమతి పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ తనదైన హవా చూపించారు. బాలయ్యతో పోటీ పడి మరీ నటించారు. శ్రుతిహాసన్ గ్లామర్‌తో పాటు అనువైన చోట తన నటనతో అలరించారు. హనీ రోజ్ అభినయం తప్పకుండా జనాన్ని కట్టిపడేస్తుంది.
దర్శకుడు మలినేని గోపీచంద్ తనకు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో సక్సెస్ అయినట్టు చెప్పొచ్చు. గోపీచంద్ కథకు సరిపడేలా బుర్రా సాయిమాధవ్ పలికించిన సంభాషణలూ ఆకట్టుకుంటాయి. మైత్రీ మూవీస్ అధినేతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ కథకు తగ్గరీతిలో ఖర్చుపెట్టారు. తమన్ బాణీల్లో రూపొందిన “జై బాలయ్యా…” అంటూ సాగే పాట అభిమానులను అలరిస్తుంది. మిగిలిన వాటిలో “సుగుణసుందరీ…”, “మా బావ మనో భావాలు…”, “మాస్ మొగుడు…” అనే పాటలూ మాస్ ను ఆకట్టుకుంటాయి.
సినిమా : వీరసింహారెడ్డి
నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, హనీ రోస్, దునియా విజయ్, తదితరులు
డైరెక్టర్ : గోపీచంద్ మలినేని
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
ప్రొడ్యూసర్స్ : నవీన్ యెర్నేని, రవి శంకర్
కన్‌క్లూజన్ : థియేటర్లో బాలయ్య వీర”సింహా“రెడ్డి గర్జన అదిరిపోయింది.
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!