Dasari Sahithi : ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగతుంది. అటు దేశంలోనూ.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచారాలతో ఎన్నికల పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల కొందరు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల బరిలో నిలిచిన సెలబ్రిటీలు నామినేషన్స్ దాఖలు చేశారు. తాజాగా ఈ లిస్ట్ లో తెలంగాణలో కూడా మరో తెలుగు నటి లోక్ సభ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ఆమె మరెవరో కాదు పొలిమేర సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దాసరి సాహితి.
పొలిమేర చిత్రాలతో తెలుగు సినీ పరిశ్రమలో పాపులారిటీ తెచ్చుకుంది సాహితి దాసరి. ఇప్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయింది. సాహితి పొలిమేర 1, పొలిమేర 2 సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పొలిమేర సినిమాలో గెటప్ శ్రీను భార్య రాములు పాత్రలో కనిపించింది. ఇక పొలిమేర 2 సినిమాలో సత్యం రాజేష్ ను ప్రేమించిన అమ్మాయిగా కనిపించి తనదైన నటనతో జనాలను ఆకట్టుకుంది. సినిమాల్లో పలు కీలకపాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాహితి.. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఏప్రిల్ 24న నామినేషన్ దాఖలు చేసింది.
ఇటీవల సాహితి తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా రాజకీయాల గురించి స్పందించింది. తాను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిగా పేర్కొంది. ఇదివరకు తన పోస్టులలో రీల్స్ చూసి పాటలకు పొలిటికల్ విషయాలని జత చేయవద్దని కోరింది. ఇకపోతే ప్రస్తుతం చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డి, బిజెపి తరపు నుండి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నుండి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్నారు. నామినేషన్స్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే రిటర్నంగ్ అధికారి, జిల్లా కలెక్టర్ శశాంక్ కు సాహితి నామినేషన్ సమర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.