Tamannaah : ప్రముఖ నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా తన అందంతో ఏలేస్తుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాంటి తమన్నా చిక్కుల్లో పడింది. ఆమెకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ఫెయిర్‌ప్లే యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగాను ఈ నెల 29న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. తమన్నా చేసిన పనికి తమకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు ప్రసార హక్కులు కలిగిన వయాకమ్ ఫిర్యాదు చేసింది. దీంతో మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులను వయాకమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదే కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను మంగళవారం విచారణకు పిలిచారు. అయితే సంజయ్ దత్ మంగళవారం సైబర్ సెల్‌కు చేరుకోలేదు. అయితే, తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు మరికొంత సమయం కావాలని కోరారు. సంజయ్ దత్ పని నిమిత్తం ముంబై వెలుపల ఉన్నానని, అందుకే మంగళవారం విచారణకు హాజరు కాలేనని సంజయ్ దత్ సైబర్ సెల్‌కు చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. వయాకామ్ ఫిర్యాదుపై మహారాష్ట్ర సైబర్ సెల్ ఫెయిర్‌ప్లే యాప్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు చేయడానికి భాటియాను విచారించడానికి సమన్లు పంపింది. తమన్నా భాటియా ఫెయిర్‌ప్లేను ప్రమోట్ చేసిందని, అందుకే ఆమెను సాక్షిగా విచారణకు పిలిచారని వర్గాలు తెలిపాయి.