Hanu Raghavapudi : ‘సీతారామం’లో తెలుగమ్మాయిని అందుకే తీసుకోలేదు

hanu raghavapudi


Hanu Raghavapudi : రాక్షసితో తన అభిరుచిని చాటుకున్నాడు డైరెక్టర్ హను రాఘవపూడి. కృష్ణగాడి వీరప్రేమ గాథ మూవీతో ప్రతి అబ్బాయి ప్రేమకథ ఇదే అనిపించేలా చేశాడు. ఇక సీతారామం సినిమాతో రామ్-సీత లాంటి ప్రేమ కథను చరిత్రలోకూడా చూడలేదేమో.. ఇక చూడలేమోనన్న హృద్యంగా తీర్చిదిద్దాడు. ఇలా.. తీసే ప్రతి సినిమాను ఓ కాన్వాస్ పై బొమ్మలా అందంగా తీర్చిదిద్దే హను సీతారామం సినిమా గురించి మరి కొన్ని విషయాలు చెప్పాడు. 

Hanu Raghavapudi
Hanu Raghavapudi

సీతారామం సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టిన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు కలెక్షన్లు మాత్రమే కాదు ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథ. లవ్ స్టోరీ సినిమాల హిస్టరీలో ది బెస్ట్ మూవీ అనిపించుకున్న చిత్రం. మరి ఈ సినిమా కథకు ఆలోచన ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పాడు డైరెక్టర్ హను రాఘవపూడి. 

“నాకు పుస్తకాలు కొనడం అలవాటు. అలా నేను కోఠిలో కొన్న ఓ సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకంలో లెటర్ ఉంది. అది ఓపెన్‌ కూడా చేయలేదు. హాస్టల్‌లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్‌ అది. విషయం ఏమీ లేదు. సెలవులకు ఇంటికి రమ్మని రాశారు. కానీ అది చదివాక నాకు ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్‌లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే..? అని అనుకున్నా. ఆ ఆలోచనే ‘సీతారామం’ సినిమా రావడానికి మూలకారణం. కథ రాసుకున్న తర్వాత స్వప్న గారికి చెప్పా. ఈ కథకు దుల్కర్‌ కచ్చితంగా సరిపోతాడని అనిపించింది. అందుకే తనని సెలెక్ట్‌ చేశాం. కమ్యూనికేషన్‌ అనేది ప్రేమకథకు మూలం. దేవదాస్‌-పార్వతి దగ్గరి నుంచి మరోచరిత్ర  వరకూ ఏ సినిమాలో అయినా కమ్యూనికేషనే ముఖ్యం.” అని చెప్పాడు హను.

అయితే ఈ సినిమాలో సీత పాత్రకు భాషరాని ఉత్తరాది అమ్మాయినే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందో.. మన తెలుగమ్మాయిలను ఎందుకు తీసుకోలేదో కూడా చెప్పాడు హను. “సీత పాత్ర కోసం కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్‌ గురించి చెప్పింది. చూడగానే సీతపాత్రకు సరిపోతుందని అనిపించింది. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదంటే.. తెలుగు వాళ్ల ప్రొఫైల్స్‌ ఎక్కడా కనిపించవు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. అలా ఎక్కడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్‌ కనిపించవు. తెలుగు వాళ్లు దొరికితే ఇంకా మాకే హాయి.. ఎందుకంటే వాళ్లకు భాష వచ్చి ఉంటుంది. ” అని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ హను రాఘవపూడి.

సీతారామం మ్యూజిక్ చేసిన మ్యాజిక్ మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో ముత్యం లాంటింది. ఈ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుతూ.. “విశాల్‌ నాకు మొదటి నుంచి తెలుసు. సాహిత్యం బాగుంటే పాట హిట్‌ అవుతుందని నేను నమ్ముతాను. నేను మ్యూజిక్‌కు సంబంధించి ఎలాంటి సలహాలు ఇవ్వను. నాకు దాని గురించి ఏమీ తెలీదు.” అని అన్నాడు హను రాఘవపూడి.

Tags: