Shahrukh Khan : ఓవైపు సినిమాలు.. మరోవైపు బ్రాండ్స్‌కు అంబాసిడర్.. ఇంకోవైపు పలు వ్యాపారాలు.. ఇలా నిత్యం బిజీబిజీగా గడుపుతూ ఉంటారు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఈ కింగ్ ఖాన్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా ఎంతోమంది ఆయనను అభిమానిస్తారు. కేవలం నటుడిగానే కాదు.. మంచి మనస్తత్వం.. అంతకంటే గొప్ప మానవత్వం ఉన్న మనిషిగా షారుఖ్ అంటే చాలా మందికి ప్రేమ.
సినిమాలతో కోట్లకు కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే షారుఖ్.. గత ఐదేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా సరే ఈ బాద్షా ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అదేంటంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరిగా నిలవడమే కాదు, పేరున్న హాలీవుడ్ నటులైన టామ్ క్రూజ్, జార్జ్ క్లూనే, జాకీచాన్, రాబర్ట్ డి నైరో వంటి వారిని సైతం వెనక్కి నెట్టారు. షారుఖ్‌ఖాన్ మొత్తం ఆస్తి విలువ 770 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ధనవంతులైన నటుల జాబితాలో జెర్రీ షెన్‌ఫెల్డ్ 1 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి, అగ్ర స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత టేలర్ పెర్రీ (1 బిలియన్ డాలర్లు), డ్వేన్ జాన్సన్ (800 మిలియన్ డాలర్లు) టాప్-3లో ఉన్నారు. నాలుగో స్థానంలో 770 మిలియన్ డాలర్లు (రూ. 63,740,982,690)తో షారుఖ్ ఉండగా, టామ్ క్రూజ్ (620 మిలియన్ డాలర్లు), జాకీ చాన్ (520 మిలియన్ డాలర్లు), జార్జ్ క్లూనే (500 మిలియన్ డాలర్లు), రాబర్ట్ డి నైరో (500 మిలియన్ డాలర్లు)లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.
షారుఖ్‌ఖాన్ నటుడిగానే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. రెడ్‌చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పలు సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలను నిర్మిస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రినిడాడో నైట్ రైడర్స్ జట్లకు సహ భాగస్వామిగా ఉన్నారు. పలు ఉత్పత్తులకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న ఆయన భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరు.
ప్రస్తుతం షారుఖ్ నటించిన ‘పఠాన్’ విడుదలకు సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపిక పదుకొణె కథానాయిక. జాన్ అబ్రహాం ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచుతున్నాయి. యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది.