ప్రముఖ సీనియర్ నటి రాధిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన అందంతో, నటనతో దక్షిణాది కిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. ఇక తెలుగులో కూడా చిరంజీవి, బాలకృష్ణ, కమల్ హాసన్ వంటి ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక శరత్ కుమార్ ని వివాహం చేసుకున్న తర్వాత రాధిక కొంతకాలం సినిమాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత రీ ఎంట్రీ లో గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల్లో ప్రధాన పాత్రలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లో కూడా నటించి, నిర్మించి తన సత్తా చాటారు రాధిక.

ఇటీవలే లవ్ టుడే సినిమాలో నటించి మరోమారు అదరగొట్టిన ఈమె.. ప్రస్తుతం లారెన్స్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చంద్రముఖి 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా 2005 లో సూపర్ స్టార్ రజినీ కాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ముఖ్య పాత్రల్లో నటించిన “చంద్రముఖి” సినిమాకి ఇది సీక్వెల్ గా రానుంది. పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ తో పాటు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ మేరకు ఈ సీక్వెల్ లో రజనీకాంత్ కు స్థానంలో లారెన్స్ హీరోగా నటించడం గమనార్హం. బాలీవుడ్ బ్యూటీ నటి కంగనా రనౌత్, రాధిక కీలక పాత్రలలో నటిస్తుండడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో నటి రాధికకు లారెన్స్ ఒక గోల్డ్ రింగ్ కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఈ మేరకు రాధిక సోషల్ మీడియా వేదికగా రింగ్ తో పాటు వాచ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చారంటూ ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.