Yashoda Review: ‘యశోద’గా సామ్ థ్రిల్ పంచుతూ ఏడిపించేసిందిగా..!

- Advertisement -

సమంత రుత్ ప్రభు.. టాలీవుడ్ లో అనుష్క తర్వాత హీరోయిన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ గా మారుతోంది. కెరీర్ ప్రారంభంలో అందరిలా గ్లామర్ పాత్రలే చేసినా.. తర్వాత తన స్టోరీ ఛాయిస్ మార్చుకుంది. ప్రేక్షకులే కాదు అవే పాత్రలు చేసీ చేసీ తనకూ బోర్ కొట్టేసిందంటూ.. డిఫరెంట్ రోల్స్ కి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. యూ టర్న్, ఓ బేబీ సినిమాలు రాజీ వంటి వెబ్ సిరీస్ తో సామ్ రేంజ్ ఓ స్థాయికి ఎదిగింది. తాజాగా స్ట్రాంగ్ కంటెంట్ తో అంతకంటే స్ట్రాంగ్ క్యారెక్టర్ లో యశోద సినిమాతో మన ముందుకు వచ్చేసింది. తెలుగు సినిమాలో సామ్ యాక్షన్ సీన్స్ చేసిన ఫస్ట్ మూవీ ఇది. మరి ఈ మూవీలో సామ్ క్యారెక్టర్ ఎలా ఉంది.. యాక్షన్ ఎపిసోడ్స్ సమంత పర్ఫామెన్స్ ఎప్పటిలాగే ఇరగదీసిందా.. పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేసిన ఈ మూవీ ఇవాళే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో ఓ సారి చూసేద్దామా..?

 

రేటింగ్ : 3.5/5

- Advertisement -

స్టోరీ ఏంటంటే..  య‌శోద (స‌మంత) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. అందరిలాగే యశోదకు కూడా డబ్బు అవసరమవుతుంది. అదే సమయంలో తనకు సరోగసీ గురించి తెలుస్తుంది. అప్పుడే యశోద తాను కూడా సరోగసీ పద్ధతిలో బిడ్డకి జన్మనిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటుంది. దీని కోసం డాక్టర్ మ‌ధు (వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్‌కుమార్‌)కి చెందిన ఈవా ఆస్ప‌త్రిలో చేరుతుంది. ఈవా హాస్పిటల్ ది ఓ స్పెషల్ వరల్డ్. అందులో జరిగే కొన్ని సంఘటనలు యశోదలో అనుమానం కలిగిస్తాయి. ఉన్నట్టుండి త‌న‌తోపాటు బిడ్డ‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌డం కోసం ఆస్ప‌త్రిలో చేరిన తోటి మ‌హిళ‌లు అనుమానాస్ప‌ద రీతిలో మాయమైపోతుంటారు. ఇంత‌కీ ఆ మ‌హిళ‌లు ఏమ‌వుతున్నారు? య‌శోద త‌న డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఏం చేసింది.. ఆ క్రమంలో తనకు ఎలాంటి విషయాలు తెలిశాయి? ఇంత‌కీ ఈ మ‌ధు ఎవ‌రు? ఈ ఆస్ప‌త్రిలో సంఘ‌ట‌న‌ల‌కీ, బ‌య‌ట జ‌రిగిన రెండు హ‌త్య‌ల‌కీ సంబంధమేమిటి తెలుసుకోవాలంటే యశోద సినిమా చూడాల్సిందే

మూవీ ఎలా ఉందంటే.. స‌రోగసి నేప‌థ్యంలో సాగే మెడిక‌ల్ మాఫియా క‌థ ఇది. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా హ‌రి – హ‌రీష్ తెరకెక్కించారు. క‌థ సాగే నేప‌థ్యం, మ‌న‌సుల్ని తాకే భావోద్వేగాలు, స‌మంత న‌ట‌న సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. గ‌ర్భ‌ధార‌ణ కోసం ఆస్ప‌త్రిలో చేర‌డం, ఈవాలో సాగే ఆరంభ స‌న్నివేశాల‌తో  ప్రేక్ష‌కుడు నేరుగా య‌శోద ప్ర‌పంచంలోకి వెళ‌తాడు. అక్క‌డ అనుమానాస్ప‌దంగా అనిపించే విష‌యాల‌తో ప్రేక్ష‌కుడిని థ్రిల్ చేస్తూ క‌థ‌ని మ‌రింత ర‌క్తి క‌ట్టించ‌డంలో ద‌ర్శ‌కులు సక్సెస్ అయ్యారు. స‌రోగ‌సి పేరుతో జ‌రిగే నేరం చుట్టూ సాగే క‌థ అనే విష‌యం అర్థ‌మ‌వుతున్న‌ా ఉత్కంఠ రేకెత్తించే స‌న్నివేశాల‌తో  త‌ర్వాత  ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తి మాత్రం కొన‌సాగుతుంది. మాతృత్వం చుట్టూ సాగే స‌న్నివేశాలు, అద్దె గ‌ర్భం కోసం వ‌చ్చిన కొద్దిమంది యువ‌తుల జీవిత నేప‌థ్యాలతో వచ్చిన ఎమోషనల్ సీన్స్ ఫస్ట్ హాఫ్ కి హైలెట్ గా నిలిచాయి.

Yashoda Review
Yashoda Review

సెకండ్ హాఫ్ లోనే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. కానీ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో విలన్ ఎవరో తెలుసుకోవడానికి జరిగే ప్రయత్నాలే సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. మెయిన్ లీడ్, విలన్ మధ్య పోటాపోటీ ఉండి.. చివరి వరకు ఎవరు గెలుస్తారో తెలియకుండా ప్రేక్షకుణ్ని సీట్ అంచున నిలబడేలా ఉత్కంఠకు గురి చేసే సీన్లే ఈ జానర్ కి హిట్ టాక్ తీసుకొస్తాయి. ఈ క‌థ‌లో మాత్రం నేరాలు చేసేవాళ్లే  త‌మ అస‌లు రూపాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం అంత‌గా అత‌క‌లేద‌నిపిస్తుంది. క‌థ‌లో థ్రిల్ మిస్ కావ‌డానికి అదొక ప్ర‌ధాన కార‌ణం.  కానీ మ‌ధు పాత్ర‌లో న‌టించిన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్, డా.గౌత‌మ్ (ఉన్ని ముకుంద‌న్‌), కేంద్ర‌మంత్రి (రావు ర‌మేష్‌) నేప‌థ్యాలు, వాళ్లు క‌లిసిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో సామ్ మరో అవతారాన్ని చూపిస్తుంది. అది సినిమాకు అసలైన హైలైట్ పాయింట్. ఈ మూవీలో సామ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. ఆ సీన్లు చూస్తే సమంత వాటి కోసం ఎంతగా కష్టపడిందో అర్థమవుతుంది. చూడ్డానికి థ్రిల్లర్ లా కనిపించినా ఈ మూవీలో థ్రిల్ అయ్యే అంశాలకంటే ఎమోషనల్ సీన్సే ఎక్కువగా ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి.

యాక్టింగ్ ఎలా ఉందంటే.. య‌శోద‌గా స‌మంత నటన అదరగొట్టేసింది. ఇక ఎమోషనల్ సీన్స్ లో అయితే.. ఎమోషనా ఇది నాకు చాలా మామూలు విషయం అనేలా ఈజ్ తో చేసేసింది. సామ్ ఏడుస్తుంటే ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీళ్లు రావడం పక్కా. మూవీ ఫస్ట్ హాఫ్ లో అమాయ‌కంగా క‌నిపిస్తూ, త‌న‌వైన హావ‌భావాల‌తో వినోదం పంచిన సమంత, ఆ త‌ర్వాత త‌న‌లో మ‌రో యాంగిల్ ని చూపిస్తూ తన క్యారెక్టర్ ని టర్న్ చేసిన తీరు బాగుంది. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ యాక్టింగ్ కు పేరు పెట్టలేం. ఎప్పటిలాగే తన నటన సూపర్. ఉన్ని ముకుంద‌న్‌, రావుర‌మేష్‌ల పాత్ర‌లు ఆక‌ట్టుకుంటాయి. ముర‌ళీశ‌ర్మ‌, సంప‌త్‌రాజ్‌, శ‌త్రు అల‌వాటైన పాత్ర‌ల్లోనే క‌నిపిస్తారు. మ‌ణిశ‌ర్మ సంగీతం, అశోక్ క‌ళా ప్ర‌తిభ‌, సుకుమార్ కెమెరా ప‌నిత‌నం సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. ఈవా ఆస్ప‌త్రి సెట్టింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఈ మూవీలో డైలాగ్స్ ది కీలక పాత్ర. కొన్ని సంభాషణలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. డైరెక్టర్స్ హ‌రి -హ‌రీష్ తెర‌పై ఓ కొత్త క‌థ‌ని చూపించారు. కానీ ఆ క‌థ‌ని న‌డిపించిన విధానంలోనే కాస్త అక్క‌డ‌క్క‌డా లోపాలు క‌నిపిస్తాయి.

చిత్రం: యశోద, న‌టీన‌టులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు, సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్ర‌హ‌ణం: ఎం. సుకుమార్, క‌ళ‌: అశోక్, పోరాటాలు: వెంకట్, యానిక్ బెన్, కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్, నిర్మాణం: శివలెంక కృష్ణప్రసాద్. దర్శకత్వం: హరి – హ‌రీష్‌,

కన్ క్లూజన్ : య‌శోద.. సామ్ ఖాతాలో చేరిన మరో వర్సటైల్ మూవీ

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here