నా ఫ్యాన్ అంటూ.. రక్తంతో లెటర్స్ రాశాడు.. బూతు సినిమాలు పంపాడు : బాలీవుడ్ స్టార్ హీరోయిన్సినిమా సెలబ్రిటీలకు వారిని అమితంగా ప్రేమించి.. ఆరాధించే ఫ్యాన్స్ ఉండటం మామూలే. ముఖ్యంగా హీరోయిన్లకు తెగ ఫ్యాన్స్ ఉంటారు. కొందరు వారి అందానికి ఫిదా అయితే మరికొందరు వారి యాటిట్యూడ్ కి పడిపోతారు. కొన్నిసార్లు ఈ ఆరాధన పరిధులు దాటుతుంది. అలాంటప్పుడే అసలైన ఇబ్బందులు వస్తుంటాయి.

ముఖ్యంగా హీరోయిన్లకు ఫ్యాన్స్ నుంచి ప్రేమ కంటే కొన్నిసార్లు ఇబ్బందులే ఎక్కువ. హీరోయిన్ కనిపిస్తే చాలు సెల్ఫీ అంటూ మీదపడి పోవడం.. కొందరైతే ముట్టుకోవాలని ప్రయత్నించడం చేస్తుంటారు. దీనికి వారు ప్రతిఘటిస్తే ఆ హీరోయిన్ కి పొగరు అని ట్రోల్ చేస్తుంటారు. అలాగని వాళ్లు సైలెంట్ గా ఉండలేరు. అందుకే అంటారేమో సెలబ్రిటీలకు ఫ్రీడం ఉండదని. పబ్లిక్ ఫిగర్ అయ్యాక ఇలాంటి ఇబ్బందులు తప్పవేమో.

అయితే ఇలాంటి ఓ భయానక అనుభవాన్ని తన కెరీర్ లో ఎదుర్కొన్నాని చెప్పింది బాలీవుడ్ అలనాటి తార రవీనా టాండన్. ఒకప్పుడు బాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసి.. తన అందంతో నటనతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కేజీఎఫ్ వంటి సినిమాలతో.. వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా ఉంది. నాలుగు పదులు దాటినా రవీనా అందం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. తాజాగా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు ఓ ఫ్యాన్ వల్ల ఎదుర్కొన్న సమస్య గురించి మాట్లాడింది ఈ భామ.

“నేనంటే విపరీతమైన ఇష్టమంటూ.. నా డై హార్డ్ ఫ్యాన్ అంటూ ఓ వ్యక్తి నుంచి ఉత్తరాలు వచ్చేవి. కొన్నిసార్లు అవి రక్తంతో రాసి ఉండేవి. అతడి తీరు చూస్తే చాలా భయమేసేది. కొన్నిసార్లు బ్లడ్ వయల్స్.. బూతు సినిమాలను కొరియర్ పంపేవాడు. ఒకసారైతే నేను, నా భర్త, పిల్లలతో కలిసి బయటకు వెళ్తుంటే మా కారుపై పెద్ద రాయి విసిరాడు. త్రుటిలో తప్పించుకున్నాం. కొన్నిరోజుల తర్వాత మా ఇంటి గేటు ముందు క్యాంప్ వేసుకుని వెయిట్ చేశాడు. భయమేసి పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ విషయం గుర్తొస్తే ఇప్పటికీ భయమేస్తుంది.”