Rashmika Mandanna : రిషబ్‌ శెట్టి దెబ్బకు దిగొచ్చిన రష్మిక.. దారి చూపించింది వాళ్లిద్దరేనంటూ..Rashmika Mandanna : ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే తెలివైనవాడు. ఈ డైలాగ్ ఎక్కడో ఉన్నట్టుంది కదూ. ఇంకెక్కడ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలోది. ఇది సినిమా డైలాగే కావొచ్చు. కానీ ఈ మాటలు అక్షరాలా సత్యం. ఈ మాటలను బాగా ఒంట పట్టించుకున్నట్లుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. గత కొంతకాలంగా కాంతార హీరో రిషన్ శెట్టితో జరుగుతున్న కోల్డ్ వార్ కు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్లుంది. అందుకే..?

Rashmika Mandanna
Rashmika Mandanna

కన్నడ నటులు రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టిల విషయంలో ఇటీవల విమర్శలు ఎదుర్కొన్న నటి రష్మిక తాజాగా వాళ్లిద్దరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వాళ్ల వల్లే తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగలిగానని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నటిగా ఇన్ని భాషల్లో పనిచేస్తున్నందుకు, ప్రేక్షకులను అలరిస్తున్నందుకు ఆనందిస్తున్నా. ఇప్పటివరకూ కెరీర్‌లో నేను మంచి నటీనటులతో కలిసి పనిచేశాను. అయితే, ఒక నటిగా నేను పరిశ్రమలోకి రావడానికి రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టినే కారణం. వాళ్లే నాకు ఇండస్ట్రీలోకి దారి చూపించారు. నటిగా తొలి అవకాశాన్ని ఇచ్చారు’’ అని రష్మిక పేర్కొంది.

అనంతరం ఆమె సోషల్‌మీడియా ట్రోలింగ్‌పై స్పందించింది. ‘‘సాధారణంగా నేను మౌనంగా ఉండే వ్యక్తిని. అందుకే మొదట్లో ఎన్ని ట్రోలింగ్స్‌ వచ్చినా పట్టించుకోలేదు. ప్రేక్షకులపై నాకున్న గౌరవం అలాంటిది. అదీ కాక మొదట్లో నా గురించే విమర్శలు చేసేవారు. అవేమీ నన్ను ఇబ్బందిపెట్టలేదు. కానీ, ఇప్పుడు ఆ ట్రోల్స్‌ నా చెల్లి, కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే నేను వాటిని అంగీకరించలేకపోతున్నా. నా సోదరి మానసిక ఆరోగ్యం కాపాడటమే నా బాధ్యత’’ అని చెప్పుకొచ్చింది. జీవితమంటేనే పోరాటమని.. ప్రతి విషయంలోనూ పోరాటం చేయకతప్పదని.. కెరీర్‌ ఆరంభంతో పోలిస్తే సమస్యలు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయని అన్నది.

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తోన్న ఈ భామ గతేడాది ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తన కెరీర్‌ ఎలా మొదలైందో చెప్పారు. ‘కిరిక్‌ పార్టీ’తో తనకు తొలి అవకాశాన్ని ఇచ్చిన ‘పరంవా’ బ్యానర్‌ పేరు చెప్పడానికి ఆమె ఆసక్తి కనబర్చలేదు. రక్షిత్‌ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి రిషబ్‌ దర్శకత్వం వహించారు. మరోవైపు రిషబ్‌ నటించిన ‘కాంతార’ చూడలేదని ఆమె చెప్పారు. ఈ క్రమంలోనే పలువురు కన్నడిగులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిషబ్‌ సైతం ఈ ప్రవర్తన పట్ల అసహనంగా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.