Ram Charan : హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన భార్య ఉపాసన, కుమార్తె క్లింకారతో కలిసి తిరుమల ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం రామ్ చరణ్ దంపతులు వీఐపీ ప్రారంభ దర్శనంలో వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలు అందజేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని చెర్రీ మంగళవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లారు. చరణ్ ఈరోజు (మార్చి 27) తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన వెంకన్న సేవలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురు క్లింకారా పుట్టిన తర్వాత రామ్ చరణ్ తొలిసారి శ్రీవారిని దర్శించుకున్నారు.
రామ్ చరణ్ పుట్టినరోజున మెగా ప్రిన్సెస్ ‘క్లింకారా’ విజువల్స్ అభిమానుల ముందుకొచ్చాయి. శ్రీవారి ఆలయ మహద్వార ప్రవేశ సమయంలో తల్లి ఉపాసన ఒడిలో క్లింకారా ఉండగా అకస్మాత్తుగా అభిమానుల కెమెరాకు విజివల్స్ చిక్కాయి. ఈ ఫోటోల్లో క్లింకారా ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. క్లింకారాను చూసిన మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో క్లింకారా విజువల్స్ బయటికి రావడం శుభసూచకమని మెగా అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో రాజకీయ నేతగా, ఐఏఎస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని మొదటి పాటను ఈరోజు విడుదల చేయనున్నారు.