టాలీవుడ్ బుట్టబొమ్మ, జిగేలు రాణి, అరవింద, ముకుంద.. ఇవన్నీ ఎవరి పేర్లు అనుకుంటున్నారా. అదేనండి మన పూజా హెగ్డే. ఒక లైలా కోసం మజ్ను సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసిన Pooja Hegde .. వరుస అవకాశాలతో దూసుకెళ్లింది. ముకుంద, అరవింద, బుట్టబొమ్మ, జిగేలు రాణి, ప్రేరణ.. ఇలా చేసిన ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే లాంటి పాత్రలు చేసింది. వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీకి గత మూడు సినిమాలు నిరాశపరిచాయి. అయినా ఆఫర్లు మాత్రం తగ్గలేదు.
ఓవైపు షూటింగ్స్.. మరోవైపు యాడ్స్ తో బిజీగా ఉన్న పూజకు సడెన్ గా కాలికి గాయమైంది. కొన్నాళ్ల పాటు రెస్ట్ తీసుకోవాలన్న డాక్టర్ల సలహా మేరకు ఇంటి పట్టునే ఉంది. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా బయటకు వెళ్తోంది. కానీ ఇంకా షూటింగ్స్ లో మాత్రం పాల్గొనడం లేదు. అయితే ఇంట్లో రెస్ట్ తీసుకునే సమయంలోనూ తన ఫ్యాన్స్ కు దగ్గరలో ఉండటానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది. ఎప్పటికప్పుడు తన హెల్త్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని అలరించింది.
అలాగే ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీగా ఉండటమెందుకని గతేడాది తాను కొత్తగా తీసుకున్న ఇల్లు గురించి ఓ వ్లాగ్ చేసింది. ఆ వ్లాగ్ ని యూట్యూబ్ లో షేర్ చేసింది. ఈ బుట్టబొమ్మ ఇల్లును.. ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు వెనక ఉన్న స్టోరీ గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. పూజా క్లారిటీకి.. టేస్టుకు ఫిదా అయ్యారు.
‘‘నా ఇంటిని నిర్మించేటప్పుడే నేనెలాంటి వ్యక్తిని.. నా ఇష్టాయిష్టాలు ఎలా ఉన్నాయి? అన్నది తెలిసింది అని పూజా హెగ్డే చెప్పింది. తన అభిరుచులకు తగ్గట్లుగా సరికొత్తగా ముస్తాబు చేసుకున్న ముంబయిలోని తన ఇంటిని.. సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ చూపించింది పూజా. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదలు ప్రతిదీ తన అభిరుచిగా తగట్టుగానే సెట్ చేయించుకుంది.
‘‘జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఇప్పటి వరకు జీవిత ప్రయాణంలో నా గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. నా ఇంటిని నిర్మించే క్రమంలో నేనెలాంటి వ్యక్తిని.. నా అభిరుచులు ఎలా ఉన్నాయి అనేది మరింత స్పష్టంగా తెలిసింది. ఈ ఇంటిని కార్మికులు ఎంతో శ్రద్ధ, ప్రేమతో తీర్చిదిద్దారు. సినిమాల్లో పనిచేయడం వల్ల ప్రతిదానికీ ఓ కథ ఉండేలా చూడటం అలవాటైంది. అందుకే నా ఇంటి ప్రవేశ ద్వారాన్ని ప్రత్యేకంగా.. చాలా స్టైలిష్‌గా రూపొందించుకున్నా. ఈ ప్రధాన ద్వారం నా ఇంటికి ట్రైలర్ లాంటిది. న్యూయార్క్, లండన్ దేశాల్లోని స్టైల్ ఉట్టిపడేలా ఇంటిలోని ప్రతి స్పేస్‌ని డిజైన్ చేశా.
ఇంట్లో వాళ్లతో మాట్లాడుతూ.. వంటలు చేయడమంటే నాకిష్టం. అందుకే ఓపెన్ కిచెన్ ఏర్పాటు చేసుకున్నా. నాకిష్టమైన సినిమాలు, సందేశాలతో ఓ గోడను సిద్ధం చేయించా. వాటిని చూస్తే నేనెప్పుడూ స్ఫూర్తి పొందుతా. మా కుటుంబంతో కలిసి పడక గదిలోనే సినిమాలు చూస్తాం’’ అంటూ తన ఇంటిలోని ప్రతి గదినీ పరిచయం చేసింది ఈ బుట్టబొమ్మ. అంతేకాదు తాను ఉపయోగించే హ్యాండ్ బ్యాగ్స్, పాదరక్షలు, మేకప్ సామాగ్రిని సైతం ఈ వీడియో ద్వారా చూపించింది.