Nayanthara : సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఈ ఇండస్ట్రీ బయటకు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో.. లోపల మాత్రం అంతకుమించిన అంధకారంలో ఉంటుంది. తెరపై కనిపించే అందాల తారలు.. తెర వెనక పడే ఇబ్బందులెన్నో. సినిమాల్లోకి రావాలనుకునే ప్రతి ఒక్కరు తెర వెనక జరిగే వాటిని తట్టుకోగలిగితేనే వెండితెరపై వెలుగులీనగలుగుతారు. అలా తట్టుకొని తెగించి వచ్చిన వాళ్లు కొందరైతే.. తలొగ్గి కాంప్రమైజ్ అయి వచ్చిన వాళ్లు మరికొందరు.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు మొదటి అవకాశం రావడం అనేది చాలా కష్టంతో కూడుకుంది. కొన్నిసార్లు వాళ్లు ఆ అవకాశం కోసం ఊహించని సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్లకు ఈ కష్టాలేం ఉండవు. ఎటొచ్చి వెనకాల ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం సినిమాపై ఉన్న ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలకు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇండస్ట్రీలోకి వచ్చే దాదాపు ప్రతి అమ్మాయి ఎదుర్కొనే సమస్య కాస్టింగ్ కౌచ్. నిర్మాతలు, డైరెక్టర్ల నుంచి కొన్నిసార్లు అసిస్టెంట్ డైరెక్టర్ల వరకు ఇలా ప్రతి ఒక్కరి వల్ల ఏదో ఒక సందర్భంలో హీరోయిన్ అవుదామని వచ్చిన అమ్మాయిలు ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్‌పై చాలా మంది హీరోయిన్లు గొంతెత్తారు. ఇది కేవలం టాలీవుడ్లోనే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్..
ఇలా అన్ని సినిమా ఇండస్ట్రీల్లో ఉన్న సమస్యే. బీ టౌన్లో అయితే కొందరు హీరోయిన్లు తాము కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కొన్నామని బయటకు వచ్చి మీడియా ముందు చెప్పారు. అంతే కాదు కాస్టింగ్ కౌచ్‌కు ఓకే చెప్పడం వల్లే తమకు మొదటి అవకాశం వచ్చిందని.. లేకపోతే ఇవాళ ఈ స్థానంలో ఉండేవాళ్లం కాదని కూడా చెప్పిన వాళ్లున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అవకాశం రావడం చాలా కష్టమని.. దాని కోసం కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వక తప్పదని కొంతమంది మీడియా ముందు బహిరంగంగా మాట్లాడిన హీరోయిన్లు కూడా ఉన్నారు.
తాజాగా లేడీ సూపర్ స్టార్ అదేనండి స్టార్ హీరోయిన నయనతార కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు. “ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది లేదు అని నేను మాట్లాడను. కానీ ఇలాంటివి ఎదురైనప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలన్నది మాత్రం పూర్తిగా అమ్మాయిల చేతుల్లోనే ఉంటుంది. మనం ప్రవర్తించే తీరుని బట్టి మనకు సమస్యలు ఎదురువుతాయని నేననకుంటాను. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో నాకు ఈ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయి. నన్ను కూడా చాలామంది కమిట్మెంట్ అడిగారు. అయితే అందుకు నేను నో అని సమాధానం చెప్పాను. నేను నా టాలెంట్‌ను నమ్ముకుని ఇక్కడికి వచ్చాను. ఆ టాలెంట్‌తోనే ఈ స్థాయికి ఎదిగాను” అని నయనతార అన్నారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే ఇటీవలే కనెక్ట్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖా ఖాన్‌తో కలిసి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నటిస్తోంది. గతేడాది డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది నయన్.