Masooda Review : ‘మసూద’.. ప్రేక్షకులను భయపెట్టిందా..?

- Advertisement -

చిన్న సినిమాలకు ప్రేక్షకులకు నీరాజనం పడుతున్నారు. కంటెంట్ ఉంటే చాలు హీరో హీరోయిన్ డైరెక్టర్లతో పనిలేదంటూ ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలని చిన్నచూపు చూడకుండా ప్రేక్షకులు జై కొడుతోంటే.. మరోవైపు స్టార్స్ కూడా వాళ్లకి సపోర్ట్ ఇస్తున్నారు. ట్రైలర్ లాంఛ్, ఆడియో రిలీజ్ అంటూ ప్రమోషన్స్ లో పాల్గొంటూ మద్దతిస్తున్నారు. అలా ట్రైలర్ రిలీజ్ వరకు సౌండ్ లేకుండా ఉన్న ఓ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక ఒక్కసారిగా ప్రేక్షకుల్లో తన రేంజ్ పెంచుకుంది. అదే మసూద. ఈ సినిమా కోసం నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు ప్రమోషన్స్ చేశారు. మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత రాహుల్‌ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. రెండు హిట్ లతో జోష్ మీదున్న రాహుల్ మసూదతో హిట్ కొట్టారా.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మసూదను ఆడియెన్స్ ఆదరించారా చూద్దాం.

రేటింగ్  : 3/5

స్టోరీ ఏంటంటే..  నీలం (సంగీత) తన భర్త అబ్దుల్ (సత్య ప్రకాష్‌)కు దూరంగా ఉంటూ తన కూతురు నాజియా(బాంధవి శ్రీధర్) ఆలనా పాలనా చూసుకుంటుంది. నీలం పక్కింట్లోనే ఉండే గోపీ (తీరువీర్) కాస్త భయస్థుడు. గోపీ తన సహోద్యోగి మినీ (కావ్యా కళ్యాణ్‌ రామ్)ను ప్రేమిస్తుంటాడు. నీలంకు గోపీ చేదోడువాదోడుగా ఉంటాడు. అలాంటి సమయంలో నాజియా వింతగా ప్రవర్తిస్తుంటుంది. అప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు గోపీ. దెయ్యం పట్టి ఉంటుందన్న అనుమానంతో ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో గోపీకి ఎదురైన ఘటనలు ఏంటి?  మినీతో ప్రేమ వ్యవహారం ఏమవుతుంది?నీలం తన కూతురిని రక్షించుకుంటుందా? నాజియాకు దెయ్యం ఎందుకు పట్టింది? అసలు మసూద ఎవరు? మసూద నేపథ్యం ఏంటి? చివరకు గోపీ ఏం చేశాడు? ఈ కథలో పీర్ బాబా (శుభలేఖ సుధాకర్), అల్లాఉద్దీన్ (సత్యం రాజేష్‌) పాత్రలు ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.

- Advertisement -
మూవీ ఎలా ఉందంటే.. మసూద సినిమాను ఒక చిన్న పాయింట్ పరంగా చూస్తే ఇది చాలా పాత కథే అనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో చాలా ఇంట్రెస్టింట్‌గా అనిపిస్తుంది. ప్రజెంట్‌లోకి వచ్చాక కథ సాదాసీదాగా అనిపిస్తుంది. అదే ఇంటర్వెల్ సమయానికి అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. మసూద గురించి ఇంట్రడక్షన్ మాత్రం సెకండాఫ్‌లోనే ఉంటుంది. ఒక్కసారి మసూద కథ ఏంటి? అన్నది రివీల్ అయ్యాక.. ప్రేక్షకుడికి కాస్త రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ కాస్త సాగదీసినట్టుగా అనిపించినా కూడా జనాలను మాత్రం భయపెట్టేశారు.

 

యాక్టింగ్ ఎలా ఉందంటే.. మసూద మూవీలో గోపీ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ పాత్రకు తగ్గట్టుగా తిరువీర్ చక్కగా నటించాడు. తిరువీర్ అంటే విలనిజం గుర్తుకు వచ్చేది. కానీ ఇందులో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించాడు. భయస్తుడిగా, మొహమాటస్తుడిగా తనదైన శైలిలో నటించాడు. ఇక సంగీత అయితే తన సీనియారిటీని చూపించింది. ఎమోషనల్ సీన్స్‌లో కన్నీరు పెట్టించేసింది. కావ్యా కళ్యాణ్‌ రామ్‌ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేనట్టుగా అనిపిస్తుంది. కానీ కనిపించినంత సేపు అందంగా అనిపిస్తుంది. ఇక నాజియా పాత్రలో నటించి బాంధవి మాత్రం నిజంగానే భయపెట్టేసింది. ఈ సినిమా అంతా కూడా ఆమె చుట్టూనే నడిచింది. మసూద పాత్ర హైలెట్ అయినా ఆ క్యారెక్టర్‌లో ఎవరు నటించారన్నది సరిగ్గా చూపించలేదు. సీక్వెల్ కోసం దాచినట్టుగా అనిపిస్తుంది.

మిగిలిన పాత్రల్లో సత్యం రాజేష్‌, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్‌ వారి పాత్రల పరిధి మేరకు నటించారు. డెబ్యూ డైరెక్టర్ అయినా సాయి కిరణ్ మసూద సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. పాత కథే అయినా దాన్ని రాసుకున్న నేపథ్యం, తీసిన తీరు మాత్రం కొత్తగా అనిపిస్తుంది. అక్కడే డైరెక్టర్ సాయి కిరణ్ పనితనం కనిపిస్తుంది. మిగతా డిపార్ట్మెంట్‌ల మీద తనుకున్న గ్రిప్ కనిపిస్తుంది. కెమెరా, మ్యూజిక్ ఈ రెండింటిని సాయి కిరణ్ బాగా వాడుకున్నాడు. నిర్మాత కూడా  సినిమాకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. సాధారణంగా హార్రర్ మూవీస్ కి బీజీఎం ప్రాణం. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కొన్ని సీన్లలో బీజీఎం ప్రేక్షకులను సీటు అంచును కూర్చొబెట్టేస్తుంది.

చిత్రం : మసూద;  నటీనటులు : సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేక సుధాకర్, సత్యం రాజేష్ ; దర్శకుడు : సాయి కిరణ్ ; నిర్మాత : రాహుల్ నక్క; మ్యూజిక్ బీజీఎం : ప్రశాంత్ ఆర్ విహారి

కన్ క్లూజన్ : స్లోగా అయినా కాస్త గట్టిగానే భయపెట్టిస్తున్న ‘మసూద’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here