ఇకపై అవి ఇంతకుముందులా ఉండవు తాతగారు.. సితార ఎమోషనల్ పోస్టు



‘ఒక కంటిలో నుంచి గంగ… మరో కంటిలో నుంచి యమున ఒక్కసారే కలిసి ఉప్పొంగతుండగా సూపర్ స్టార్ కృష్ణకు కన్నీటి వీడ్కోలు పలుకింది తెలుగు అభిమాన ప్రపంచం. ఆయణ్ను ఒక్కసారైనా చూడాలనుకున్న అభిమానులు చివరకు కడసారి చూడటానికి తరలివచ్చారు. తమ ఇంట్లోని ఆత్మీయులే దూరమైనంతగా బాధ పడ్డారు. అశ్రునయనాల మధ్య.. భారమైన హృదయంతో బుర్రిపాలెం బుల్లోడికి కడసారి వీడ్కోలు పలికారు. 360కిపైగా సినిమాలతో వినోదం పంచి, అన్ని విధాలుగా పరిశ్రమని పరుగులు పెట్టించి, గొప్ప వారసత్వాన్ని అందించిన ఘనత సూపర్‌స్టార్ కృష్ణకు గుండెలనిండా అభిమానం నింపుకుని వచ్చిన ప్రేక్షకలోకం, సన్నిహితులు, సినీ, రాజకీయ వర్గాలు ఆయన సినిమాల్ని, ఆయన పంచిన వినోదాన్ని స్మరించుకుంటూ తుది వీడ్కోలు పలికారు.

తన తాతయ్య, సూపర్‌స్టార్‌ కృష్ణ మరణం పట్ల మహేశ్‌బాబు కుమార్తె సితార భావోద్వేగానికి గురైంది. నెల వ్యవధిలోనే నానమ్మ, తాతయ్య పోగొట్టుకున్న ఆ చిట్టిగుండె తల్లడిల్లింది. తన తాతయ్య కృష్ణతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆమె ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది. కృష్ణతో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేసిన సీతూ పాప.. ‘‘ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్‌ అవుతున్నా’’ అని పోస్టులో రాసుకొచ్చింది.

సితార
సితార

ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెటిజన్ల హృదయాన్ని తాకింది. ‘బీ స్ట్రాంగ్ సీతూ పాప’ అంటూ పలువురు సోషల్‌ మీడియా యూజర్లు కామెంట్స్‌ జత చేస్తున్నారు. మరోవైపు మహేశ్‌బాబు తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తండ్రి పార్థివ దేహాన్ని చూసి ఆయన తీవ్ర ఉద్వేగానికి గురవుతున్నారు.

మరోవైపు గౌతమ్ కూడా సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ కృష్ణను స్మరించుకున్నాడు. మీరు ఎక్కడున్నా నేను ఎప్పుడూ మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను. మాకు తెలుసు మీరు కూడా మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తాత గారు. అంటూ గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు.