Rajamouli : తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు ప్రపంచమంతా కన్నెత్తి చూసేలా చేసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. విదేశీ ప్రేక్షకుల నుంచి హాలీవుడ్ డైరెక్టర్ల వరకు ఈ చిత్రానికి నీరాజనాలు పడుతున్నారు. కేవలం ప్రశంసలే కాదు ఈ సినిమాకు పురస్కారాల పంట కూడా పండుతోంది.
ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం.. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు ‘ పాట ఆస్కార్ నామినేషన్లలో నిలిచింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్ర బృందానికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్‌లో నిలవడంపై చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ లేఖను పోస్టు చేశారు.
“నా సినిమాలో నా పెద్దన్న పాటకు ఆస్కార్ నామినేషన్ వచ్చింది. నేను ఇంతకంటే ఎక్కువగా అడగలేను. ప్రస్తుతం తారక్, చరణ్‌ల కన్నా నేనే నాటు నాటు పాటకు చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాను’ అన్నారు.
‘చంద్రబోస్ గారూ కంగ్రాచ్యులేషన్స్… ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ పాట కోసం మీ కృషి అమూల్యం. నా వ్యక్తిగత ఆస్కార్ మీకే. నాటు నాటు పాట విషయంలో చాలా కాలం పాటు సందిగ్ధంలో ఉన్న నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది. ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్లేలా చేసింది. థాంక్యూ భైరీ బాబు. రాహుల్ సిప్లిగంజ్ భైరవ అద్భుతంగా పాడారు.”
“ఇక ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సమన్వయం, స్టైయిల్. తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది. కానీ టార్చర్ పెట్టినందుకు సారీ. ఛాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఇలా ఆడుకోవడానికి నేను వెనుకాడనండోయ్! అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని ఊహించలేదు. ఇదంతా నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు.” అని హర్షం వ్యక్తం చేశారు రాజమౌళి.
“అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని ఊహించలేదు. ఇదంతా నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. ఇక కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అలుపెరగకుండా అతడు పనిచేయడం వల్లే ఈ ఘనత సాధ్యమైంది. నీ పట్ల గర్విస్తున్నాను. ఇంకా ఈ పాటకు 24 గంటల పాటు ప్రచారం చేయడంలో కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు కృతజ్ఞతలు. ఆస్కార్‌కు మరొక్క అడుగుదూరంలో ఉన్నాం… థాంక్యూ” అని అన్నారు రాజమౌళి.