Drishyam 2 : రూ.100 కోట్లు మిస్ చేసుకున్న వెంకటేశ్, మోహన్​లాల్.. లక్ అంటే అజయ్ దేవగణ్​దే..!

- Advertisement -

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్​లాల్​లు ఓ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారు. ఓ బ్లాక్​బస్టర్ సినిమాను తీసి.. అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల వాళ్లో ఓ మంచి అవకాశాన్ని కోల్పోయారు. ఒకే సినిమాను మలయాళం, తెలుగు భాషల్లో రీమేక్ చేసి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నారు. కానీ ఓటీటీలో విడుదల చేయడంతో వసూళ్లు ఎక్కువగా రాబట్టుకోలేకపోయారు. అదే సినిమాను బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ హిందీలో రీమేక్ చేశాడు. వెంకీ, మోహన్​లాల్ మిస్ అయిన లక్​ అజయ్​ను వరించింది. థియేటర్​లో రిలీజ్​ చేసిన ఆ సినిమా రూ.100 కోట్ల క్లబ్​లో చేరడానికి చేరువలో ఉంది. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో ఓ క్లారిటీ వచ్చింది కదా మీకు. అదేనండి.. సూపర్ హిట్ థ్రిల్లర్ మూవీ దృశ్యం. దానికి సీక్వెల్​గా వచ్చిన దృశ్యం 2.

Drishyam 2
Drishyam 2

 

‘దృశ్యం’.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని సినిమా. ఈ మలయాళ బ్లాక్‌బస్టర్‌ చిత్రం పలు భాషల్లో రీమేక్‌ అయింది. దానికి కొనసాగింపుగా గతేడాది ‘దృశ్యం2’ వచ్చింది. కరోనా కారణంగా మోహన్‌లాల్‌ నటించిన మలయాళ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. అయితే, ఇతర భాషల్లో రీమేక్‌ హక్కులు విక్రయమవడంతో కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో వెంకటేశ్‌ కీలక పాత్రలో రూపొందించారు మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌.

- Advertisement -

 

ఈ మూవీని థియేటర్‌లో తీసుకొచ్చేందుకు చాలా రకాలుగా ప్రయత్నించారు. కరోనా ఉద్ధృతి పూర్తిగా తగ్గని పరిస్థితుల్లో నిర్మాతలకు నష్టం రాకూడదని, ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో చివరకు ఈ మూవీని ఓటీటీ బాట పట్టించారు. ఇప్పుడు ఇదే చిత్రం అజయ్‌ దేవగణ్‌కీలక పాత్రలో హిందీలో రీమేక్‌ అయి, ఇటీవల థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసి అభిషేక్‌ పాఠక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజయ్‌తో పాటు, అక్షయ్‌ ఖన్నా, టబు, శ్రియాలు కీలక పాత్రలు పోషించారు.

 

విడుదలైన రోజు నుంచే మంచి టాక్‌తో హిందీ ‘దృశ్యం-2’ మంచి వసూళ్లు రాబడుతోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.64 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ తెలిపారు. మళ్లీ శుక్రవారం వరకు ఏ సినిమాలు లేకపోవడం వల్ల ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది. దాంతో మరో రెండు మూడు రోజుల్లో రూ.100కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.

 

ఇలా థియేటర్‌లో వసూళ్ల వర్షం కురిసే అవకాశాన్ని మోహన్‌లాల్‌, వెంకటేశ్‌లు కోల్పోయారు. వాళ్ల సినిమాలు కూడా థియేటర్‌లో విడుదలై ఉంటే, నిర్మాతలకు లాభాల పంట పండేది. ఆ రెండు చిత్రాల నిర్మాణానికి అయిన వ్యయంతో పోలిస్తే, ఓటీటీలో మంచి ధరకే విక్రయిమైనట్లు అప్పట్లో ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అయినా ఇలాంటి సినిమాలు థియేటర్‌లో చూస్తే వచ్చే మజానే వేరు కదా! అన్నట్లు ‘దృశ్యం3’ ఉంటుందని జీతూ జెసెఫ్‌ గతంలోనే చెప్పారు. మరి తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం రాంబాబు మళ్లీ ఏం చేస్తాడో చూద్దాం!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here