Atlee: అట్లీకి తెలుగు హీరోలంటే ఇంత చులకనా.. ఆ లిస్ట్ లో కనీసం ఒక్కరి పేరు కూడా చెప్పలేదు..



Atlee: ‘జవాన్‌’ సినిమా విజయంతో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ . షారుక్ ఖాన్‌ హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విజయోత్సాహంలో అట్లీ పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్నారు. తాను ఏయే హీరోలతో సినిమాలు తెరకెక్కించాలనుకుంటున్నారో తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.

Atlee
Atlee

బాలీవుడ్‌ స్టార్స్‌ సల్మాన్‌ ఖాన్‌, హృతిక్‌ రోషన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌ లతో పని చేయాలనుందని మనసులో మాట బయటపెట్టారు. ముందుగా సల్మాన్‌, రణ్‌బీర్‌తో సినిమాలు తెరకెక్కించాలనుందని చెప్పారు. ‘‘జవాన్‌’ విషయంలో దేవుడి ఆశీస్సులు నాపై ఉన్నాయనుకుంటున్నా. మంచి స్క్రిప్టు రాయగలిగేలా చేశాడాయన. అది పక్కాగా ఉండడంతో తర్వాత ప్రాసెస్‌ (చిత్రీకరణ, పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు) సజావుగా సాగింది’’ అట్లీ తెలిపారు. మరో ఇంటర్వ్యూలో వరుస విజయాలు సాధించడంపై స్పందిస్తూ..

‘‘నేను రచయితలా, దర్శకుడిగా సినిమా తీయను. ఓ అభిమానిగా తెరకెక్కిస్తా. వ్యక్తికి అభిమానిని కాదు.. సినిమాకు అభిమానిని. ఒక చిత్రంలో అన్నింటినీ బ్యాలెన్స్‌ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఫార్ములాలు లేవు. ఏది బాగుంటుందనిపిస్తే అది చేస్తా. నా జీవితంలో నేర్చుకున్న విషయాలనే సినిమాలో చూపిస్తా. నాకుటుంబం, నా చుట్టూ ఉండే వ్యక్తుల నుంచి నేను గమనించిన విషయాలను సినిమాగా చిత్రీకరిస్తా. అదే నా విజయం వెనుక రహస్యం’’ అని అన్నారు.